ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా రాద్దాంతం

ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశానికి ఆయువు ప‌ట్టుగా ఉంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం (సీఈసీ). 143 కోట్ల మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తి రూపంగా నిల‌వాల్సిన ఈసీ ఇప్పుడు స‌వాల‌క్ష ప్ర‌శ్న‌ల‌ను ఎదుర్కొంటోంది. 1947 నుంచి ఇది అమ‌లులోకి వ‌చ్చింది. నిష్ప‌క్ష పాతంగా ఎన్నిక‌లు జ‌రిపించాల్సిన బాధ్య‌త ఈసీపై ఉంది. ఆయా రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల‌తో పాటు లోక్ స‌భ , రాజ్య‌స‌భ‌, రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తుంది. ఎన్నిక‌ల సంఘం శాశ్వ‌త‌మైన రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌. 2001లో ఇది స్వ‌ర్ణోత్స‌వాన్ని కూడా జ‌రుపుకుంది. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌ను ప్ర‌ధాని సిఫార‌సు మేర‌కు రాష్ట్ర‌ప‌తి నియ‌మించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఇది ప‌క్క‌న పెడితే 2014లో కాంగ్రెసేత‌ర భార‌తీయ జ‌న‌తా పార్టీ భార‌త దేశంలో అధికారంలోకి వ‌చ్చిందో ఆనాటి నుంచి నేటి దాకా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్వ‌హ‌ణ తీరు ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌త్యేకించి ప్రతిప‌క్షాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

స‌ద‌రు సంస్థ మోదీ క‌నుస‌న్న‌ల‌లో న‌డుస్తోంద‌ని, త‌న‌కు చెందిన వారినే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌ను నియ‌మించారంటూ తీవ్ర స్తాయిలో మండిప‌డ్డారు కూడా. దీనిపై పార్ల‌మెంట్ లో స‌భ్యులు పెద్ద ఎత్తున లేవ‌దీశారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు , ఎంపీ రాహుల్ గాంధీ ఈ దేశంలో భార‌త రాజ్యాంగం ప్ర‌మాదంలో ప‌డిందంటూ ప్ర‌కటించాడు. ఈ మేర‌కు త‌ను భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టాడు. దీనికి ఊహించ‌ని రీతిలో స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌జ నుంచి వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ బీజేపీ, దాని అనుబంధ పార్టీలు (ఎన్డీఏ) ఎలా సీట్లు గెలుస్తాయో చెప్పాల‌ని నిల‌దీశారు కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని. ఇదే విష‌యం గురించి స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఇదే క్ర‌మంలో చీఫ్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నియామ‌కం తీవ్ర రాద్దాంతానికి దారి తీసింది కూడా. ఓ వైపు రిటైర్ అయిన వెంట‌నే త‌న‌కు అత్యున్న‌త‌మైన రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌కు సీఈసీగా ఎంపిక చేయ‌డం ఈ అనుమానాలకు బ‌లం చేకూరిన‌ట్ల‌యింది. ఈ వ్య‌వ‌హారంపై దాఖ‌లైన పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఆనాటి సీజేఐ జస్టిస్ చంద్ర‌చూడ్.

ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌లకు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది బీజేపీ . మేం ఫ్రాడ్ కు పాల్ప‌డితే మీరు ఎలా గెలుస్తారంటూ ప్ర‌శ్నించింది. ఈవీఎంలు వ‌ద్ద‌ని బ్యాలెట్ ద్వారానే ఎన్నిక‌లు నిర్వహించాల‌నే డిమాండ్ అంత‌కంత‌కూ పెరుగుతోంది. ప్ర‌పంచాన్ని శాసిస్తున్న పెద్ద‌న్న అమెరికా దేశంలో సైతం ఈవీఎంల వ్య‌వ‌హారంపై తీవ్ర దుమారం చెల‌రేగింది. బ్యాలెట్ ద్వారానే ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని కోరుతున్నారు అక్క‌డి ప్ర‌జాస్వామిక‌వాదులు. ఈ త‌రుణంలో రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై. ఆయా రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ జ‌రిగిన తీరు తెన్నుల‌పై త‌మ‌కు అనుమానాలు ఉన్నాయ‌ని, పూర్తి ఎన్నిక‌ల‌లో పాల్గొన్న ఓట‌ర్ల జాబితాను ఇవ్వాల‌ని కోరారు. దీనికి ఈసీ స‌మాధానం ఇచ్చింది. కానీ పూర్తి స‌మాచారాన్ని ఇవ్వ‌లేక పోయింది. తాజాగా మ‌రోసారి సీరియ‌స్ కామెంట్స్ చేశారు ఈసీపై. ఏకంగా ఢిల్లీ వేదిక‌గా ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. త‌మ వ‌ద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

బీహార్ రాష్ట్రంలో త్వ‌ర‌లో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధి మాత్ర‌మే ఉంది. ఇంత‌లోపే 1,00,000 ఓట్లు గ‌ల్లంత‌య్యాయ‌ని, కావాల‌నీ ఈసీ తొల‌గించిందంటూ రాహుల్ గాంధీతో పాటు ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్ ఆరోపించారు. ఈ సంద‌ర్బంగా ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు ఈసీని ఉద్దేశించి. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ణాటక అసెంబ్లీ సెగ్మెంట్‌లో భారీ ఓటర్ల మోసం జరిగిందని త‌మ పార్టీ జ‌రిపిన‌ దర్యాప్తులో తేలిందన్నారు. అక్ర‌మంగా గెలిచేందుకు బీజేపీ ఈసీతో కుమ్మ‌క్కైందంటూ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇచ్చిన కొన్ని నెలలకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారత కూటమి ఎన్నికల కూట‌మి ఎందుకు ఓడి పోయింద‌ని ప్ర‌శ్నించారు.
గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 సీట్లలో 30 సీట్లు గెలుచుకున్న భారత కూటమి, కేవలం ఐదు నెలల తర్వాత జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో 50 మార్కును కూడా దాటలేక పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంద‌న్నారు. హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్, మ‌హారాష్ట్ర‌ల‌లో బీజేపీకి పూర్తి వ్య‌తిరేక‌త ఉన్నా ఎలా గెలుపొందుతారంటూ నిల‌దీశారు.

మ‌హారాష్ట్ర‌ను ప్ర‌త్యేకంగా ప్రస్తావించారు. గ‌త ఐదు ఏళ్ల‌లో కంటే 5 నెల‌ల్లో ఎక్కువ మంది ఓట‌ర్లు చేరార‌ని అన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కోటి మంది కొత్త ఓట‌ర్లు చేరార‌ని, సాయంత్రం 5.30 గంట‌ల‌కు ఓటింగ్ పెరిగింద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొనడాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఈసీ చెప్పింది అబ‌ద్ద‌మ‌ని త‌మ పార్టీకి చెందిన బూత్ ఏజెంట్లు చెప్పార‌ని తెలిపారు రాహుల్ గాంధీ. విచిత్రం ఏమిటంటే తాను జ‌రిపిన ఎన్నిక‌ల‌కు సంబంధించి డిజిట‌ల్ ఓట‌రు జాబితా ఇవ్వాల‌ని కోరామ‌ని కానీ ఎందుకు నిరాక‌రించిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఆయ‌న ఆధారాన్ని చూపించారు. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభలో పోలైన మొత్తం ఓట్లు 6.26 లక్షలు. బిజెపి 6,58,915 ఓట్లు పోల‌య్యాయి. 32,707 ఓట్ల తేడాతో గెలిచింది. మేం మహదేవపురాన్ని పరిశీలించాం. అక్కడ కాంగ్రెస్ కు 1,15,586 ఓట్లు రాగా బిజెపి 2,29,632 ఓట్లు సాధించింద‌న్నారు.

త‌మ పార్టీ అన్ని ఎమ్మెల్యేల సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది. అయితే బీజేపీ లోక్ స‌భ సీటు పొందింది. ఇందులో 1,00,250 దొంగ ఓట్లు పోలైన‌ట్లు తేలింది త‌మ విచార‌ణ‌లో అని చ‌చెప్పారు. ఇందులో న‌కిలీ ఓట‌ర్లు, చెల్ల‌ని చిరునామాలు, ఒకే అడ్ర‌స్ లో బ‌ల్క్ ఓట‌ర్లు ఉన్నార‌ని తేలింద‌న్నారు. ఇదే స‌మ‌యంలో తొలిసారి ఓట‌ర్ల క‌సం ఉద్దేశించిన ఫార‌మ్ 6 దుర్వినియోగం అయ్యింద‌ని ఆరోపించారు.
ఈ మొత్తం వ్య‌వ‌హారంపై క‌ర్ణాట‌క ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాహుల్ గాంధీ చేసిన ఆరోప‌ణ‌ల‌కు తాము సమాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామ‌ని, అయితే కోర్టుకు తెలియ చేస్తామ‌ని తెలిపింది. ఇందుకు సంబంధించి త‌మ పేరుతో ఓ విన‌తి ప‌త్రం ఇవ్వాల‌ని కోరింది. మొత్తంగా రాహుల్ గాంధీ తో పాటు తేజ‌స్వి , ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లు, వ్య‌క్తం చేస్తున్న అనుమానాల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం బ‌హిరంగంగా ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంది. లేక‌పోతే రాజ్యాంగ సంస్థ‌పై నీలి నీడ‌లు క‌మ్ముకునే ప్ర‌మాదం పొంచి ఉంది.

  • Related Posts

    భూమి పుత్రుడా..గాయ‌కుడా అల్విదా..!

    అస్సాం న‌గ‌రం జ‌న సంద్రంగా మారింది దుఖఃంతో. త‌మ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించేలా చేసింది. అశేష జ‌న‌వాహిని త‌న‌కు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హ‌జారికా గుర్తుకు…

    కుల వివ‌క్ష నిజం దేశానికి ప్ర‌మాదం

    ఈ దేశంలో కుల ర‌క్క‌సి కుట్ర‌ల‌కు తెర లేపుతోంది. కోట్లాది మాన‌వ స‌మూహాన్ని విభ‌జించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది అణ్వాయుధాలు, మిస్సైల్స్ కంటే అత్యంత ప్ర‌మాదాక‌ర‌మైన‌ది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *