
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను కలిగి ఉన్న దేవుళ్లలో తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఒకరు. ప్రతి నిత్యం 70 వేల నుంచి 80 వేల మంది దాకా భక్తులు సుదూర ప్రాంతాల నుండి తరలి వస్తారు. ఇక బ్రహ్మోత్సవాలు, ఇతర పుణ్య దినాలు, పండుగల రోజులలో దర్శించుకునే వారి సంఖ్య దాదాపు 1,00,000కు పైగా దాటుతుంది. ప్రతి నిత్యం భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవరి హుండీ ఆదాయం రూ. 3.5 కోట్ల నుంచి 4 కోట్లకు పైగా ఉంటుంది. ఇక స్వామి వారికి వివిధ రూపాలలో అందే ఆభరణాలు, ఆస్తుల గురించి లెక్కే లేదు. స్వామి వారికి సంబంధించి ఆస్తుల విలువ దాదాపు రూ. వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. పాలక మండలి ఉన్నా, దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షించినా అందరి కళ్లు తిరుమల కొండ పైనే. ఈ ఆలయంపై ఆధారపడిన కుటుంబాలు వేలల్లో ఉన్నాయి.
కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు 20 వేల మందికి పైగానే పని చేస్తుంటారని అంచనా. ఒక్క కరోనా సమయంలో మాత్రమే తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసి ఉంచారు. ఆ తర్వాత నిత్యం పూజలు, ఉత్సవాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజు రోజుకు భక్తుల సంఖ్య, దర్శించుకునే వీఐపీలు, వీవీఐపీల సంఖ్య పెరుగుతోంది. దీంతో పాలక మండలికి పాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందుకు గాను లేటెస్ట్ గా టెక్నాలజీ పరంగా చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి త్వరిత గతిన చేయాలని భావించింది. ఈ మేరకు పలుమార్లు పాలక మండలి సమావేశమైంది. కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించి భక్తుల రద్దీని తగ్గించ వచ్చని, కేవలం గంట వ్యవధిలోనే దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావు.
ప్రతి రోజూ సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కలగాలంటే కనీసం 18 గంటల నుంచి 24 గంటల సమయం పడుతోంది. ఇదే సమయంలో ప్రముఖుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. మరో వైపు దాతల సంఖ్య పెరుగుతోంది. వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం వచ్చే , దర్శించుకునే వారికి సరిపోవడం లేదు. ఇది ఇబ్బందిగా మారింది. ప్రాణ సంకటంగా పరిణమించింది. గతంలో పని చేసిన ఈవోలు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆశించిన మేర వర్కవుట్ కాలేదు. ఇదే క్రమంలో టెక్నాలజీని ఉపయోగించినా స్వామి వారి దర్శనం త్వరగా అవుతుందని ఆశించలేమంటున్నారు భక్తులు. ఇటీవలే స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రముఖులు, క్రీడాకారులు, సెలిబ్రిటీలు వీలైనంత మేర ఏడాదికి ఒకే ఒక్కసారి దర్శించుకుంటే బావుంటుందని సూచించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వీఐపీలకు షాక్ తగిలింది. ఈ క్రమంలో ఈవోగా కొలువు తీరిన జె. శ్యామల రావు పదే పదే ఏఐ జపం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు నిబద్దత కలిగిన అధికారిగా పేరు పొందిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మాజీ టీటీడీ ఈవో ఎల్ వీ సుబ్రమణ్యం. ఆయన ఏకంగా టీటీడీని , పాలక వర్గాన్ని, అధికారుల తీరును, నిర్ణయాలను తప్పు పట్టారు. అంతే కాదు ఇప్పటికే ఉన్నతాధికారులు ఉండగా అదనంగా ఏఈవోగా చౌదరిని ఎందుకు నియమించారంటూ ప్రశ్నించారు.
తాజాగా తను షాకింగ్ కామెంట్స్ చేశారు. శ్రీవారి దర్శనం విషయంలో పాలక మండలి తీసుకున్న నిర్ణయం వర్కవుట్ కాదని కుండ బద్దలు కొట్టారు. AI వినియోగంపై మండిపడ్డారు. శ్రీవారి ఆలయంలో గంటలో స్వామి వారి దర్శనం అనేది అసంభవం అన్నారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని మించి దర్శనంలో మార్పు చేసే అవకాశం లేనే లేదన్నారు . ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీ ధనాన్నీ వృథా చేసేందుకు ప్రయత్నం చేస్తోందని, ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. ఆ ధనాన్ని భక్తులకు ఇబ్బందులు పడకుండా వసతి సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ఆయన చేసిన కామెంట్స్ అటు పాలక మండలిలోనూ, ఇటు ఉన్నతాధికారుల్లోనూ, మఠాధిపతుల్లోనూ, పూజారుల్లోనూ కలకలం రేపాయి. అయితే ఏఐ వాడకం వల్ల ఎంత ఖర్చు చేస్తున్నారనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వక పోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఎల్వీ. ఏది ఏమైనా టెక్నాలజీని వాడుకోవడం లో తప్పు లేదు. కానీ ఉన్న స్థలాన్ని మార్చేందుకు వీలు లేదు. ప్రముఖులను కాదనలేరు. మొత్తంగా ఏఐ వినియోగం వల్ల శ్రీవారి దర్శనం మరింత మెరుగవుతుందని, గంటలోనే అవుతుందని అనుకుంటే, ఆచరణలో ప్రయోగాత్మకంగా చూపిస్తే బాగుంటుంది. మరి ఎల్వీ చేసిన కామెంట్స్ కు టీటీడీ పాలక మండలి, చైర్మన్, ఈవో ఏం సమాధానం ఇస్తారో వేచి చూడాలి. ఇందు కోసం శ్రీవారి భక్తులు కూడా స్వామి వారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు.