
ఎవరీ దివ్యా దేశ్ ముఖ్ అంటూ యావత్ దేశం ఒక్కసారిగా విస్మయానికి గురైంది. సాధించాలన్న సంకల్పం ఉంటే దానికి వయసుతో పనేంటి అంటూ నిరూపించింది మరాఠాకు చెందిన దివ్యా దేశ్ ముఖ్. అతి పిన్న వయసులో చరిత్రను సృష్టించింది. భారతీయ చదరంగపు క్రీడా రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకుంది. ఫైడ్ చెస్ ప్రపంచ ఛాంపియన్ టోర్నీలో దిగ్గజాలను కాదని తను రియల్ ఛాంపియన్ గా నిలిచింది. ఓ వైపు యువత డ్రగ్స్, బెట్టింగ్ గేమ్స్, మద్యం, బూతుకు అలవాటు పడి విలువైన కాలాన్ని కోల్పోతుండగా ఇంకో వైపు కొందరు యువతీ యువకులు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. ఈ మధ్యనే ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. సెంచరీతో కదం తొక్కాడు. రాజస్థాన్ రాయల్స్ లో కీలకమైన ఆటగాడిగా మారాడు. తనను గుర్తించి ప్రోత్సహించింది కోచ్ ద్రవిడ్. ఇదే సమయంలో కేవలం 19 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ ఛాంపియన్ గా మారడం మామూలు విషయం కాదు. కొందరు అదృష్టాన్ని నమ్ముకుంటారు. ఇంకొందరు కష్ట పడతారు. మరికొందరు రేయింబవళ్లు శ్రమిస్తారు. అనుకున్నది సాధించేంత దాకా నిద్ర పోరు. అలాంటి కోవలోకి వస్తుంది దివ్యా దేశ్ ముఖ్.
డిసెంబర్ 9, 2005లో నాగ్ పూర్ లో పుట్టింది. తనకు చిన్నప్పటి నుంచి చెస్ అంటే ఇష్టం. ఇందుకు కారణం కూడా ఉంది. తను పొట్టిగా ఉండటంతో ఇతర ఆటలపై అంతగా ఫోకస్ పెట్టలేక పోయింది. ఇదే సమయంలో మెదడుకు పదును పెట్టింది. అనుకున్న లక్ష్యం పై గురి పెడితే ఏదైనా సాధించడం తేలికవుతుందని అంటోంది ఈ గ్రాండ్ మాస్టర్. నన్ను నేను ఎక్కువగా తెలుసుకునేందుకు నాకు కుటుంబం తోడ్పడింది. అంతకు మించి నాలో ఆత్మ విశ్వాసం మరింత పెంపొందంచేందుకు నేను చదివిన పుస్తకాలు నాకు ఉపకరించాయి. ప్రధానంగా సాహిత్యం పట్ల నాకు మక్కువ ఎక్కువ. ఇక వెనుదిరిగి ఆలోచించే సమయం నాకు లేకుండా పోయింది. ఒక్కటే కళ్ల ముందు ఏదో ఒక రోజు ప్రపంచ ఛాంపియన్ కావాలని. అది ఇంత త్వరగా నెరవేరుతుందని తాను అనుకోలేదంది దివ్యా దేశ్ ముఖ్. ఈ ఒక్క గెలుపుతో తను వచ్చే ఏడాది 2026లో జరిగే మహిళల వరల్డ్ చెస్ టోర్నీకి అర్హత సాధించింది. తన జర్నీలో ఆసియా ఛాంపియన్ షిప్ , ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్ , ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్ షిప్ లు ఉన్నాయి.
ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ లో మాజీ ఛాంపియన్ తాన్ ఝెంగీని ఓడించింది సెమీస్ లో. ఆ తర్వాత ఫైనల్ లో భారత దేశానికి చెందిన కోనేరు హంపికి షాక్ ఇచ్చింది. తనకు ఎదురే లేదని చాటింది దివ్యా దేశ్ ముఖ్. అంతకు ముందు 2020లో చెస్ ఒలింపియాడ్ లో బంగారు పతకం పొందింది. 2022లో కాంస్య పతకాన్ని సాధించింది. 2023లో ఆసియా కాంటినెంటల్ ఉమెన్ టైటిల్ కైవసం చేసుకుంది. 2024లో షార్జా ఛాలెంజర్స్ విజేతగా నిలిచింది. ఇదే ఏడాదిలో అండర్ 20 చెస్ ఛాంపియన్ గా అవతరించింది. కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి, సౌమ్య స్వామినాథన్ తర్వాత టైటిల్ కైవసం చేసుకున్న నాల్గవ భారతీయురాలిగా చరిత్ర నమోదు ఏసింది. 2025 జూన్ లో లండన్ లో జరిగిన వరల్డ్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్ లో హెక్సామిండ్ చెస్ క్లబ్ తరపున ఆడింది. సెమీఫైనల్స్‌లో మహిళల ప్రపంచ నంబర్ 1 హౌ యిఫాన్‌ను ఓడించింది. ఫెడ్ ఛాంపియన్ గా అరుదైన ఘనతను సాధించిన దివ్యా దేశ్ ముఖ్ ఇప్పటి దాకా సాగించిన ప్రయాణంలో ఎన్నో విజయాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలను సాధించేందుకు తాను ప్రయత్నం చేస్తూనే ఉంటానని స్పష్టం చేసింది. నేటి యువ తరం ఆమెను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. దివ్యా దేశ్ ముఖ్ సాధించిన ఈ విజయం 143 కోట్ల మంది ప్రజలకు గర్వపడేలా చేసింది.