
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదానికి ఆహుతయ్యారు. రంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ఈ ఘటన యావత్ దేశాన్ని విస్తు పోయేలా చేసింది. ఇంతటి ఘోరం జరిగినా యాజమాన్యం ఇప్పటి వరకు ముందుకు రాలేదు. జరిగిన తప్పును సరి చేసేందుకు ఒప్పుకోక పోవడం క్షమించరాని నేరం. విచిత్రం ఏమిటంటే ఇంకా 8 మంది ఆచూకీ దొరకలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు తీరాక ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కుప్ప కూలిన ఘటన మరిచి పోక ముందే సిగాచి పరిశ్రమలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇది పూర్తిగా యాజమాన్యంతో పాటు సదరు సంస్థకు మద్దతుగా ఉన్న సర్కార్, కార్మిక శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు పరిహారం చెల్లించ లేదు. సీఎం ఆదేశించినా ఈరోజు వరకు సిగాచి స్పందించ లేదు. సదరు సంస్థ ధిక్కార స్వరం వెనుక ఎవరు ఉన్నారనేది బహిరంగ రహస్యమే.
ఇవాళ సిగాచి ఘటన రేపు ఇంకో పరిశ్రమలో జరగదన్న గ్యారెంటీ ఏమిటి. ఇప్పటి వరకు భద్రతా ప్రమాణాలను పాటించ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. బాధ్యత వహించాల్సిన కలెక్టర్ కానీ, కార్మిక శాఖ కానీ ఈరోజు వరకు ఘటనకు జరిగిన కారణాలు ఏమిటనే వాస్తవాలను ప్రకటించ లేదు. సీఎంతో పాటు మంత్రులు వెళ్లారు. కానీ ఈ దారుణ నిర్లక్ష్యానికి బలైపోయిన ప్రాణాల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన సర్కార్ కానీ, యాజమాన్యం కానీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం క్షమించరాని నేరం. ఇందుకు సంబంధించి విచారణకు ఆదేశించినా ఒరిగింది ఏమీ లేదు. పటాన్ చెరువు, తదితర ప్రాంతాలలో ఎక్కువగా ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈరోజు వరకు తమ వారి గురించిన ఆనవాళ్లు కూడా దొరకలేదంటూ బాధిత కుటుంబాలు బావురుమన్నాయి. ప్రతిపక్ష నాయకుడు హరీశ్ రావు వద్ద తమ గోడు వెళ్ల బోసుకున్నారు. ఇందుకు సంబంధించిన హృదయ విదారకమైన దృశ్యాలు సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేశాయి.
ఇదే సిగాచి ఫార్మా ఘటనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ సందర్బంగా పిల్ ను స్వీకరించిన కోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. ఈ ప్రమాద ఘటనలో ఎందుకు ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. తీవ్రంగా మందలించింది కూడా. పాశ మైలారం ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా సర్కార్ ఏం చేసిందంటూ నిలదీసింది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందంటూ మండిపడింది కూడా.
సిగాచి ఫార్మా కంపెనీలో జూన్ 30వ తేదీన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాధితులకు న్యాయం చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దావా దాఖలు చేశారు మాజీ శాస్త్రవేత్త బాబు రావు. ఈ పిటిషన్ విచారణ సమయంలో ఎంత మందిని అరెస్టు చేశారని న్యాయమూర్తి అడగగా, ఎవరిని అరెస్టు చేయలేదని సమాధానం ఇచ్చారు హోంశాఖ తరపున న్యాయవాది. అంత మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సిగాచి కంపెనీ యాజమాన్యాన్ని బాధ్యులుగా నిర్ధారించేందుకు అనేక చట్టాలు ఉన్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారుహైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్.
ప్రమాదం జరిగిన రోజు విధులకు హాజరైన వారి పూర్తి వివరాలు కోర్టుకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రమాదం వల్ల మరణించిన, గాయపడిన కార్మికులందరికీ త్వరగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హై లెవెల్ కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది తెలపగా, ప్రస్తుతం జరుగుతున్న విచారణకు దానికి సంబంధం ఏంటని నిలదీశారు. ఇంత పెద్ద ప్రమాదానికి సంబంధించిన విచారణలో నిర్లక్ష్యం తగదని, విచారణ వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆగస్టు 27కి విచారణ వాయిదా వేసింది కోర్టు. ఇది పక్కన పెడితే ఇంత దారుణం జరిగినా పట్టనట్లు సర్కార్ వ్యవహరించడం, బాధ్యతా రాహిత్యంతో కోర్టుకు సమాధానం చెప్పడం అత్యంత బాధాకరం. ఏది ఏమైనా కోర్టులు జోక్యం చేసుకుంటేనే కానీ ప్రభుత్వాలు స్పందించ లేని స్థితికి చేరుకోవడం ప్రమాదకరం.