
మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, టెక్నాలజీ హబ్ గా భారత్ విరాజిల్లుతోందంటూ నిత్యం ప్రచారం చేసుకునే ఇండియాలో సైబర్ కేటుగాళ్లు (నేరస్థులు) ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 23,000 కోట్లకు కన్నం వేశారు. తమ తెలివి తేటలకు పని చెప్పారు. అప్పనంగా తమ బినామీ ఖాతాల్లోకి మళ్లించారు. ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా ఇలాంటి వారి బారిన పడి మోసానికి గురవుతున్న వాళ్లు కోకొల్లలు. వీరి గురించి ఎంత చెప్పినా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంతగా సాంకేతికత అభివృద్ది చెందుతున్నా మోసం జరుగుతూనే ఉంది. కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా ఆచరణలోకి వచ్చేసరికల్లా వర్కవుట్ కావడం లేదు. ఇంత పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు కొల్ల గొట్టిన విషయాన్ని సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. ఈ భారీ మోసం గత ఏడాది 2024లో చోటు చేసుకుందని అధికారికంగా ప్రకటించింది. విస్తు పోయే వాస్తవాలను బహిరంగ పరిచింది.
కోట్లాది రూపాయలు పూర్తిగా ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలలో చోటు చేసుకున్నాయి. సైబర్ నేరస్థుల మోసానికి ఎక్కువగా టెక్నికల్ గా నాలెడ్జ్ కలిగిన వాళ్లు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు , వ్యాపారవేత్తలు, సంస్థలు ఇందులో ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే బ్యాంకు సంబంధిత మోసాలు నాటకీయంగా పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. సైబర్ కేటుగాళ్ల మోసానికి పాల్పడడం వల్ల ఇండియా రూ. 22, 842 కోట్లకు పైగా కోల్పోయారంటూ చావు కబురు చల్లగా చెప్పింది. రోజు రోజుకు రాబోయే రోజుల్లో అప్రమత్తం కాక పోతే ఈ మోసం మరింత పెరిగే ఛాన్స్ లేక పోలేదని వార్నింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సంచలన ప్రకటన చేసింది ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్. ఈ ఏడాది ఇండియన్స్ రూ. 1.2 లక్షల కోట్లకు పైగా నష్ట పోతారని అంచనా వేసింది. ఇదే విషయాన్ని ఆర్బీఐని హెచ్చరించింది.
డిజిటల్ సైబర్ నేరగాళ్లు గత 2023 సంవత్సరంలో రూ. 7,465 కోట్ల మోసానికి పాల్పడ్డారు. అదే 2024 సంవత్సరానికి వచ్చే సరికల్లా మూడు రెట్లు పెరగడం విస్తు పోయేలా చేస్తోంది. 2022లో రూ. 2,306 కోట్లు కొల్లగొట్టారు. ఇవన్నీ ఆన్ లైన్ ఆర్థిక మోసాలలో భారతీయులు ఎక్కువగా నష్ట పోతుండడం గమనార్హం. ఇక సైబర్ నేరస్థుల కారణంగా మోస పోయిన వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. ఫేక్ కాల్స్, ఫేక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్ లను దొంగిలించడం, టెక్నాలజీని ఉపయోగించడం , తదితర వాటి కారణంగా పెద్ద ఎత్తున కోట్లు ఖాళీ అవుతున్నాయి ఖాతాలలోంచి. గత ఏడాది 2024లో 20,00,000 ఫిర్యాదులు నమోదయ్యాయి. 2023లో 15.6 లక్షల ఫిర్యాదుల కంటే ఎక్కువ. ప్రధానంగా ఈ సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతుని తేలింది. గూగుల్ పే, యూపీఐ, పే టీఎం, ఫోన్ పే, వాట్సాప్ , టెలిగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ , స్మార్ట్ ఫోన్ ఆధారిత సేవల ద్వారా చీటింగ్ చేస్తున్నట్లు గుర్తించింది.
ప్రధానంగా డిజిటల్ చెల్లింపుల ద్వారానే అత్యధికంగా మోసాలకు గురవుతున్నట్లు తేల్చింది. ఆర్బీఐ ఎన్ని హెచ్చరికలు చేసినా ఎక్కడో ఒక చోట మోస పోతూనే ఉన్నారు. బలమైన సాంకేతిక సౌలభ్యం లేక పోవడం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అన్ని సంస్థలు ఎవరికి వారే ఐటీ ఆధారిత విభాగాలను ఏర్పాటు చేసుకున్నా డిజిటల్ మోసాలు, సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడలేక పోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం . ప్రధానంగా టెక్నాలజీలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కేటుగాళ్లు ఏఐ, ఎంఎల్ , సైబర్ సెక్యూరిటీ ఆధారంగా తెలివిగా మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ బ్యాంకులలో కంటే ప్రైవేట్ రంగ బ్యాంకులు, సంస్థలలోనే 60 శాతానికి పైగా మోసాలు జరిగాయని స్పష్టం చేసింది ఆర్బీఐ. రాబోయే రోజుల్లో మోస పోకుండా ఉండాలంటే మరింత జాగ్రత్తగా ఎవరికి వారు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందుకు కేంద్ర సర్కార్ బలమైన, సమర్తవంతమైన సాంకేతికతను తయారు చేస్తే తప్పా మోసాల నుంచి కాపాడలేం.