
ఆన్ లైన్ బెట్టింగ్, గేమ్స్ బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడం అభినందనీయమే. కానీ చాపకింద నీరులా పాతుకు పోయిన ఈ అస్తవ్యస్తమైన వ్యవస్థను నిర్మూలించడం కత్తి మీద సాము లాంటిది. ఎన్ని చట్టాలు చేసినా , ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని కేసులు నమోదు చేసినా అక్రమ వ్యాపారం కొనసాగుతూనే ఉంటుంది. ఇది చాప కింద నీరులా ప్రవహిస్తోంది. ముఖ్యంగా యూత్ ను ఇది ఎక్కువగా ఆకర్షిస్తోంది. వారి జీవితాలను మొగ్గలోనే తుంచేస్తోంది. ఆన్ లైన్ లో గేమ్స్ , బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రాజ్యం ఏలుతున్నాయి. కోట్లాది రూపాయలను కురిపిస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశలను , బలహీనతలను ఆసరాగా చేసుకుని భారీ సంస్థలు బహిరంగ దోపిడీకి తెర తీశాయి. వీటికి ప్రభావితమైన వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్లు రోజుకు దేశ వ్యాప్తంగా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. విచిత్రం ఏమిటంటే యువత ఉసురు తీస్తున్న ఆన్ లైన్ బెట్టింగ్, గేమ్స్ కు సినీ స్టార్స్, సెలిబ్రిటీలు ప్రచారకర్తలుగా వ్యవహరించడం మరింత మోస పోయేలా చేస్తోం
ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, బీహార్, ఢిల్లీ, ముంబై, తదితర ప్రాంతాలన్నీ ఈ ఆన్ లైన్ బెట్టింగ్, గేమ్స్ విష వలయంలో చిక్కుకున్నాయి. బయటకు రాలేక విల విల లాడుతున్నాయి.పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించినా మార్పు రావడం లేదు. మొదట ఉచితంగానే యాక్సెస్ ఉంటోంది. ఆ తర్వాత వాటికి అడిక్ట్ అయ్యేలా చేస్తున్నారు. ఒక రకంగా ఈ జూదం మానసికంగా, శారీరకంగా పీల్చి పిప్పి చేస్తోంది. విలువైన జీవితాలను నాశనం చేస్తోంది. వందలాది కేసులు నమోదవుతున్నాయి. శిక్షలు వేసినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తీర్పు చెప్పే లోపు శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు వీటి నిర్వాహకులు. బాధితులను రక్షించేందుకు చేఇన ప్రయత్నం ఫలించడం లేదు. తెల్లారే సరికల్లా బతుకులు తెల్లారి పోతున్నాయి. ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్స్ మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంటోంది. ఇది ఫక్తు వ్యాపారంగా మారింది. చిన్నారుల నుంచి పెద్దల దాకా , స్కూల్,కాలేజీలు, యూనివర్శిటీలు, నిరుద్యోగులు, యువతీ యువకులు, మహిళలు, సెలిబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇలా చెప్పుకుంటూ సమాజంలో భాగమైన వారిలో లెక్కించ లేనంత మంది ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ ల బారిన పడ్డారు.
వాటి నుంచి బయటకు రాలేక కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నారు. వీటిని నియంత్రించేందుకు చట్టాలు ఉన్నప్పటికీ ఇవేవీ ప్రభావితం చేయడం లేదు. ఇటీవలే తెలంగాణలో వీటిని ప్రమోట్ చేసినందుకు గాను సినీ రంగానికి చెందిన నటీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్యూయర్స్ పై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ చోటు చేసుకుందని ఈడీ రంగంలోకి దిగింది. విచారణ చేపట్టింది. సెలిబ్రీటల వాదన వింతగా ఉంది. ప్రభుత్వం అనుమతి పొందిన ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్స్ కే తాము ప్రచారం చేస్తున్నామని పేర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా విస్తరించిన ఈ అడిక్టెడ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెడుతోంది. రోజు రోజుకు ఇది ప్రాణాంతంకంగా మారడంతో ఎట్టకేలకు మోదీ సర్కార్ ఆన్ లైన్ బెట్టింగ్, గేమ్స్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీనిని కట్టడి చేయడం ముఖ్య ఉద్దేశం. 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు ప్రచారం చేసే వారిపై భారీ ఎత్తున జరిమానా విధించేందుకు వీలు కలుగుతుంది.
ప్రధానంగా వీటి కారణంగా ఆస్తులు అమ్మేసి అప్పులు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనిని నియంత్రించేందుకే సర్కార్ బిల్లును తీసుకొచ్చింది. ఇది చట్టంగా మారితే వ్యసనాలను నియంత్రించడం, ఆర్థిక మోసాలను అరికట్టడం, ఆయా రాష్ట్రాలలో ఉన్న చట్టాలను తొలగించి దేశ వ్యాప్తంగా ఒకే చట్టం పరిధిలోకి తీసుకు రావడం దీని ముఖ్య ఉద్దేశం. దీనిని నియంత్రించేందుకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కు అప్పగించింది. అక్రమ గేమింగ్ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసే అధికారం కూడా దీనికే కల్పించింది . తాజాగా అంచనాల ప్రకారం వచ్చే 2029 నాటికి భారత్ ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ రంగ పరిశ్రమ 9.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అంటే భారతీయ రూపాయలలో అక్షరాలా రూ. 80 వేల కోట్లు అన్నమాట. ఇందులో రియల్ మనీ గేమ్ వాటా శాతం 80 శాతానికి పైగా ఉంది. నివారణ చర్యలలో భాగంగా అక్రమ బెట్టింగ్ సైట్ లను బ్లాక్ చేయడం, గేమింగ్ పై 30 శాతం పన్ను, 28 శాతానికి పైగా జీఎస్టీ విధించినా ఎలాంటి ప్రభావం చూపడం లేదు.
గత 2022 నుండి ఇప్పటి వరకు 1,400 కు పైగా సైట్ లు బ్లాక్ చేశారు. టెక్నాలజీ పరంగా చోటు చేసుకున్న అత్యాధునిక మార్పులు , లొసుగులు ఆసరాగా చేసుకుని ఆన్ లైన్ గేమింగ్ , బెట్టింగ్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. బిల్లును తీసుకు వచ్చినా వీటిని నియంత్రించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఇందు కోసం భారీగానే కసరత్తు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీటిని విడిచి ఉండలేని పరిస్థితికి చేరుకున్న కోట్లాది మంది బాధితులకు భరోసా కల్పించడం ప్రధాన సమస్యగా మారింది. వీటి కారణంగా సూసైడ్ చేసుకున్న వారి సంఖ్య వందల్లో ఉన్నా లెక్కల్లోకి రాని వారి సంఖ్య వేలల్లో ఉంటుందని అంచనా. డ్రగ్స్, సెక్స్ , ఆన్ లైన్ గేమ్స్ , బెట్టింగ్, క్రైమ్, రేప్స్ ..ఇప్పుడు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇవే అడ్డంకిగా మారాయి. దీనిపైనే ఆయా ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.