
” ఈ దేశానికి మూల స్తంభం ప్రజాస్వామ్యం. దానిని పరిరక్షించేది రాజ్యాంగం. వీటన్నింటికి ఆధారం కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణ అనేది అత్యంత కీలకం. ఇప్పుడు దేశమంతటా ఈసీ అభాసు పాలైంది. మొదటిసారిగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం ముందు బోనులో బేలగా నిలబడ్డది. అంటే అర్థం తన అస్తత్వాన్ని కోల్పోయిందన్నమాట. బహుశా పైకి ఇది చాలా సామాన్యంగ కనిపించ వచ్చు కాక. కానీ లోలోపట ఇవాళ మొత్తం దేశానికి మూల స్తంభాలైన వ్యవస్థలన్నింటిపైనా నీలి నీడలు కమ్ముకునేలా చేశాయి. స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ బద్దమైన వ్యవస్థ కేంద్ర ఎన్నికల సంఘం. ఓట్ చోరీ నిర్వాకం అనేది జరిగిందా లేదా అన్నది పక్కన పెట్టేందుకు వీలు లేదు. దీనిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓటరు , ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం పౌరుడికి కల్పించిన ప్రాథమిక హక్కు. దీనిని కోల్పోవడం అంటే అర్థం వినియోగించుకోక పోతే తను బతికినా ఈ దేశంలో , ఓటర్ల జాబితాలో చచ్చినట్టే లెక్క. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు, శాసనాలు నిర్మించేందుకు, చట్టాలను రూపొందించేందుకు వీరంతా దోహద పడతారు. రాష్ట్రాలలో శాసన సభ, శాసన మండలి , కేంద్రం స్థాయిలో పార్లమెంట్ అంటే లోక్ సభ, పెద్దల సభ (రాజ్యసభ)కు ఎన్నికవుతారు. వీరంతా ప్రతి నిర్ణయంలో కీలకమైన భాగస్వామిగా ఉంటారు. ముఖ్య భూమికను పోషిస్తారు. ప్రధానమంత్రిని ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికను నిర్వహిస్తుంది ఈసీ. ఇంతటి విశేషమైన అధికారాలను కలిగి ఉన్న జాతీయ ఎన్నికల సంఘం ఇప్పుడు సవాలక్ష ప్రశ్నలకు, లేవదీసిన అనుమానాలకు జవాబు ఇవ్వలేక పోతోంది. ఒక రకంగా నీళ్లు నములుతోంది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈసీ పనితీరు పట్ల ఆలోచింప చేసేలా చేసింది. ”
- ఇంతకూ ఈసీ చేసిన నిర్వాకం ఏమిటి..? ఎందుకు సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది..? దాని వెనుక ఉన్న కథ తెలుసు కోవాలంటే ముందుగా బీహార్ ఎన్నికల సంఘం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తేజస్వి యాదవ్ లేవదీసిన ప్రశ్నలు, ఎంపీ రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈసీ ఓటర్ల జాబితాలో గల్లంతైన ఓటర్లు, దొంగ ఓటర్లు, తొలగించిన ఓటర్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఈ కీలక సమయంలో బీహార్ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు త్వరలోనే జరగ బోతున్నాయి. ఈసీ కొత్త ఓటర్ల నమోదు, ఇప్పటికే జాబితాలో ఉన్న ఓటర్ల లిస్టులను తయారు చేసే పనిలో పడింది. అయితే ఉన్నట్టుండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 65 లక్షల ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై కీలక ప్రకటన కూడా చేసింది ఈసీ. వారి వివరాలు సరిగా లేవని, చాలా మంది చని పోయారని సమాధానం చెప్పింది నేతలు అడిగితే. అంత మంది ఎలా మాయం అవుతారంటూ ప్రజాస్వామిక వాదులు , న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీజేపీకి చెందిన బీహార్ డిప్యూటీ సీఎం పేరు మీద రెండు ఓటర్ కార్డులు ఉన్నాయి. ఈ విషయాన్ని తేజస్వి యాదవ్ బహిరంగంగానే ఆధారాలతో సహా ప్రకటించాడు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం కూడా ఒప్పుకున్నాడు. తాను రెండో ఓటును తొలగించాలని కోరానని తెలిపాడు.
తొలగించిన ఓటర్ల జాబితాకు సంబంధించి వివరాలు కావాలంటూ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, సామాజిక వేత్త యోగేంద్ర యాదవ్ , అభిషేక్ సింఘ్వీ తో పాటు ఏడీఆర్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇటు వీరితో పాటు అటు ఈసీ తరపున న్యాయవాదుల వాదనలు విన్నది. ఈ సందర్బంగా యోగేంద్ర యాదవ్ ఓటర్ లిస్టులో చని పోయారంటూ తీసి వేయబడిన వారిని సుప్రీంకోర్టులో హాజరు పరిచాడు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం , రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న మోసం బయట పడింది. అందుకే రాహుల్ గాంధీ దీనిని ఓట్ చోరీ అని ప్రకటించాడు. ఓ వైపు కేసు నడుస్తుండగానే బాధ్యత కలిగిన ఈసీ ఉన్నట్టుండి తన అధికారిక వెబ్ సైట్ లోంచి పూర్తి సమాచారాన్ని తొలగించింది. ఎందుకంటే సమాధానం చెప్పలేక పోయింది ధర్మాసనానికి. కొత్త ఓటర్లకు సంబంధించి భారీ ఎత్తున నమోదవుతున్నారని, దీని వెనుక భారీ మోసం దాగి ఉందని, ఇదంతా మోదీ, బీజేపీ , ఈసీ ఆడుతున్న నాటకం అంటూ సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ.
విచారణ సందర్భంగా బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) ప్రక్రియలో ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన 65 లక్షల మందికి సంబంధించిన జాబితా ఎక్కడుందటూ ఈసీని నిలదీసింది సుప్రీం ధర్మాసనం. అంతే కాదు ఈనెల 19వ తేదీ లోగా పూర్తి వివరాలను అధికారికంగా ఈసీ వెబ్ సైట్ లో పూర్తి సమాచారాన్ని పొందు పర్చాలని లేక పోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించింది తీవ్ర స్వరంతో. జిల్లా వారీ, బూత్ స్థాయిలో తొలగించిన ఓటర్ల పేర్లను జిల్లా ఎన్నికల అధికారి వెబ్ సైట్స్ లలో , బ్లాక్ గ్రామ పంచాయతీ కేంద్రాలలో కూడా ప్రచురించాలని స్పష్టం చేసింది. ఎందుకు తొలగించామనేది ప్రతి ఓటర్ కు ఆధారం చూపించాలని పేర్కొంది. వీటిని గుర్తించేందుకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది కోర్టు. తొలగింపు కారణం పేర్కొనాలి. ఇందులో మరణం, వలస, డూప్లికేట్ కార్డు కలిగి ఉన్నారా లేదా అనేది తెలియ చేయాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి సాయంత్రం 5 గంటల లోపు పూర్తి కావాలని ఆదేశించింది. ఆధార్ లేదా ఐడీతో పునరుద్దరణకు అవకాశం ఇవ్వాలని పేర్కొంటూనే మరో కీలక వ్యాఖ్యలు చేసింది. ఆగస్టు 22 లోపు కోర్టుకు కంప్లయెన్స్ రిపోర్టు ఇవ్వాలని కుండ బద్దలు కొట్టింది. భారత దేశ ఎన్నికల చరిత్రలో ఇది చారిత్రాత్మకమైన తీర్పుగా భావించాల్సి ఉంటుంది. 65 లక్షల మంది ఓటర్లు సాధించిన విజయం. ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందని చాటి చెప్పిన వైనం విస్మయ పరిచేలా చేసింది. ఓటు వజ్రాయుధం అది ప్రజాస్వామ్యానికి మూలం. దేశానికి బలం. దానిని విస్మరిస్తే లేదా దుర్వినియోగం చేస్తే నష్ట పోయేది మనమేనని గుర్తు పెట్టుకుంటే మంచిది. ఇకనైనా ఈసీ మారాలి. పక్షపాత ధోరణితో, ఒత్తిళ్లతో తల వంచితే ఇలాగే జరుగుతుందని గమనించాలి.