ఓట‌ర్లు కీల‌కం ప్ర‌జాస్వామ్యానికి మూల స్తంభం

ఎన్నిక‌లలో ప్ర‌తి ఓటూ కీల‌క‌మే. ప్ర‌భుత్వాల‌ను త‌ల‌కిందులు చేస్తుంది. ప్ర‌జాస్వామ్యాన్ని రక్షిస్తుంది. దీనిని విస్మ‌రించాల‌ని అనుకోవ‌డం అంటే రాజ్యాంగానికి తూట్లు పొడ‌వ‌డ‌మే. ఇది దేశ భ‌విష్య‌త్తుకు మంచిది కాదు. ఒక‌రకంగా ఇలా ఆలోచించినా లేదా మ‌ద్ద‌తు ప‌లికినా బాధ్య‌తా రాహిత్య‌మే అవుతుంది. ఓటు అని తీసి పారేయ‌డానికి ఓ వ‌స్తువు కాదు. మ‌డిచి పెట్టు కోవ‌డానికి చిత్తు కాగితం కానే కాదు. అది అత్యంత విలువైన‌ది. ప‌దిలంగా కాపాడు కోవాల్సింది. ఒక ర‌కంగా చెప్పాలంటే మ‌నిషి ఆత్మ గౌరవానికి గుర్తింపు. దేశానికి జాతీయ ప‌తాకం ఎలా ఆభ‌ర‌ణంగా మారిందో..ఓటు కూడా అంతే ప్రాధాన్య‌త క‌లిగి ఉంది. ఓటు వేయడం కేవ‌లం హ‌క్కు మాత్ర‌మే కాదు బాధ్య‌త అని గుర్తించాలి. ప్ర‌తి ఓటు ఈ దేశానికి దిశా నిర్దేశం చేసేందుకు మార్గ‌ద‌ర్శిగా ఉంటుంది. ఓటు కేవ‌లం చిన్న‌దిగా అనిపించ వ‌చ్చు చూసేందుకు. కానీ దాని వెనుక బ‌ల‌మైన శ‌క్తి దాగి ఉంది. అది చ‌రిత్ర‌ను మార్చేంత బ‌ల‌మైన ఆయుధం కూడా. ఈ దేశంలో నువ్వు ఒక‌డిగా ఉండాలంటే ఓటరుగా న‌మోదై తీరాల్సిందే. ఓటు నిన్న‌టి త‌రానికి వార‌ధిగా రేప‌టి త‌రానికి దిక్సూచి అంటూ ఓటుకు ఉన్న విలువ ఏమిటో , దానికి ఉన్న బ‌లం ఏమిటో స్ప‌ష్టం చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం.

బీహార్ లో స‌ర్ పేరుతో గంప గుత్త‌గా 65 ల‌క్ష‌ల ఓట‌ర్ల జాబితా నుంచి తొల‌గించ‌డంపై విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని ఏకి పారేసింది. బాధ్య‌తాయుత‌మైన సంస్థ‌గా ఉండాల్సిన ఈసీ ఇలా అడ్డ‌గోలుగా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాదంటూ సుతిమెత్త‌గా హెచ్చ‌రించింది. సుప్రీం ఆదేశాల మేర‌కు ఈసీ దిగిరాక త‌ప్ప‌లేదు. తొల‌గించిన ఓట‌ర్ల‌ను బ్లాక్, మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ, జిల్లా స్థాయి కార్యాల‌యాల‌లో ఓట‌ర్ల లిస్టును ఉంచుతున్న‌ట్లు పేర్కొంది. ఈసీ వెబ్ సైట్ లో పొందు ప‌ర్చాల‌ని , దీనికి ఎందుకు అభ్యంత‌రం ఉండాలంటూ ప్ర‌శ్నించ‌డ‌తో గ‌త్యంత‌రం లేక ఈసీ వివ‌రాలు అప్ లోడ్ చేసింది. ఓట‌ర్లను తొల‌గించ‌డం అంటే ప్ర‌త్యేక‌మైన కారణం అనేది స్ప‌ష్టం చేయాలి. అలా చేయ‌లేక పోతే ఈసీ త‌ప్పిదం ఉన్న‌ట్లు భావించాల్సి ఉంటుందని పేర్కొంది . గుర్తింపు ప‌త్రాల‌కు సంబంధించి ఆధార్ కార్డు చెల్లుతుంద‌ని, దానిని ఓట‌ర్ల జాబితాలో అనుసంధానం చేయాల‌ని ఆదేశంచింది.

అన్ని ఓట‌ర్ల‌ను తొల‌గిస్తే రాజ‌కీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటూ నిల‌దీసింది. ఈ విష‌యంలో ఇటు ఈసీకి అటు గుర్తింపు పొందిన పార్టీల‌కు కూడా ఉంటుంద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ప్ర‌భుత్వం జారీ చేసిన ఏ కార్డునైనా ఓట‌రు స‌వ‌ర‌ణ‌కు, లేదా న‌మోదుకు స‌రి పోతుంద‌ని స్ప‌ష్టం చేసింది. సెప్టెంబ‌ర్ 1 నాటికి అన్ని ప‌త్రాలు పూర్తి చేయాల‌ని, ఇందుకు ఆన్ లైన్ లో న‌మోదు లేదా చేర్చేందుకు వెసులుబాటు క‌ల్పించాల‌ని ఆదేశించింది ఈసీని. బూత్ లెవ‌ల్లో ఏజెంట్లు ఏం చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. గుర్తింపు పొందిన పార్టీల‌కు కూడా బాధ్య‌త ఉంటుంద‌ని వ్యాఖ్యానించింది. ఫార‌మ్ లు స‌మ‌ర్పించిన స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రిగా ర‌శీదులు అందించాల‌ని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా రాజ‌కీయ పార్టీల కంటే ఓట‌ర్లే చైత‌న్య‌వంతంగా ఉన్నారంటూ చుర‌క‌లు అంటించింది. మొత్తంగా బీహార్ స‌ర్ వ్య‌వ‌హారం కేసుపై త‌దుప‌రి విచార‌ణ వాయిదా వేసినా చివ‌ర‌కు కోర్టు చేసిన కామెంట్స్ ఆస‌క్తిక‌రంగా మారాయి. ఏది ఏమైనా ఓట‌ర్లు కీల‌కం. వాళ్లు లేక‌పోతే ప్ర‌జాస్వామ్యం లేదు. ఈ తీర్పు భార‌త దేశంలో ఇంకా న్యాయం బ‌తికే ఉంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించేలా చేసింది. ఇది శుభ ప‌రిణామం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

  • Related Posts

    భూమి పుత్రుడా..గాయ‌కుడా అల్విదా..!

    అస్సాం న‌గ‌రం జ‌న సంద్రంగా మారింది దుఖఃంతో. త‌మ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించేలా చేసింది. అశేష జ‌న‌వాహిని త‌న‌కు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హ‌జారికా గుర్తుకు…

    కుల వివ‌క్ష నిజం దేశానికి ప్ర‌మాదం

    ఈ దేశంలో కుల ర‌క్క‌సి కుట్ర‌ల‌కు తెర లేపుతోంది. కోట్లాది మాన‌వ స‌మూహాన్ని విభ‌జించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది అణ్వాయుధాలు, మిస్సైల్స్ కంటే అత్యంత ప్ర‌మాదాక‌ర‌మైన‌ది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *