
కల్వకుంట్ల కవిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తను ముందు నుంచీ సంచలనమే. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను కలిగి ఉండాలని కోరుకుంది. ఆ మేరకు తనకు తానుగా వ్యక్తిగా కాకుండా విస్మరించ లేని శక్తిగా మారింది. దీని వెనుక తన తండ్రి మాజీ సీఎం, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన కేసీఆర్ ఉన్నారనేది నిజం. ఇది కాదనలేని సత్యం. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమికను పోషించింది కవిత. తనే సెంటర్ పాయింట్ గా ఉంటూ వచ్చింది. ఉండేలా చూసుకుంది. తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించింది. ఉద్యమ భావ జాలాన్ని మరింత ప్రజ్వలించేలా చేసింది. ఆ తర్వాత లక్షలాది మందిని సాంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విశ్వ వ్యాప్తం చేయడంలో కీ రోల్ పోషించింది. ఒకానొక సమయంలో కవితమ్మా బతుకమ్మా అనే స్థితికి వచ్చింది. ఈ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ సంస్థ కాదని ఇది పక్కా రాజకీయ పార్టీ అంటూ ప్రకటించాడు కేసీఆర్. జనం నమ్మారు. పదేళ్ల పాటు అధికారాన్ని అప్పగించారు. ఈ సమయంలో అభివృద్ది జరిగింది. ఇదే క్రమంలో విధ్వంసమూ చోటు చేసుకుంది.
రాచరిక పాలన ఎలా ఉంటుందో, దొరల ఆధిపత్యం ఎలా సాగుతుందో కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లు హల్ చల్ చేశాడు కేసీఆర్. కర్ణాటక, పంజాబ్ , మహారాష్ట్ర వెళ్లి వచ్చాడు. కానీ వర్కవుట్ కాలేదు. రాష్ట్రంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. తను ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే స్థాయికి వెళ్లాడు. ఈ సమయంలో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమాతో ఉన్న గులాబీ బాస్ కు కోలుకోలేని షాక్ తగిలింది. పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి రూపంలో. తను రావడం వెనుక కమ్మ కులంతో పాటు రెడ్డి సామాజిక వర్గం కూడా ఇతోధికంగా పని చేసింది. ఈ క్రమంలోనే కోలుకోలేని షాక్ తగిలింది కల్వకుంట్ల కుటుంబానికి. ఢిల్లీ లిక్కర్ స్కాం దేశాన్ని కుదిపేసింది. అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కల్వకుంట్ల కవిత కూడా జైలుకు వెల్లింది. తిరిగి వచ్చింది . ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశించిన మేర మద్దతు లభించ లేదంటూ లోలోపల కుమిలి పోయింది. ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బాపూ అంటూ తన తండ్రికి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ లేఖ రాసింది. అది ఉన్నట్టుండి బయటకు వచ్చింది. మీడియాలో వైరల్ అయ్యింది.
దీనిపై నోరు విప్పింది కవిత. తన తండ్రి దేవుడని ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కామెంట్స్ చేసింది. ఆపై బీఆర్ఎస్ లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని బహిరంగంగానే టార్గెట్ చేసింది. తనను లిల్లీ ఫుట్ నాయకుడంటూ వ్యక్తిగతంగా దూషించింది. దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది. ఈ సమయంలో తను బీసీ నినాదం అందుకుంది. వారి పక్షాన తాను పోరాటం చేస్తానంటూ ప్రకటించింది. ఆ దిశగా అడుగులు వేసింది. ఆందోళన చేపట్టింది. అధికార పార్టీ కాంగ్రెస్ ను, కేంద్రంలోని బీజేపీని, తన పార్టీ బీఆర్ఎస్ ను ఏకి పారేస్తూ వస్తోంది. అయితే ఇదంతా కల్వకుంట్ల ఫ్యామిలీ తయారు చేసిన ప్లాన్ లో బాగమేనన్న ఆరోపణలు లేక పోలేదు. ప్రస్తుతం అత్యధిక జనాభా కలిగిన బీసీ సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోవాలనే ఆలోచనతో కవిత ఉన్నట్లు అనిపిస్తోంది. ఇందులో బాగంగానే తను ఆర్ కృష్ణయ్యను కలిసింది.. ఆయన కూడా కవితమ్మకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాడు. తను ఇప్పుడు బీజేపీ ఎంపీ.
ఈ సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశాడు. కల్వకుంట్ల కవితకు బీసీలకు ఏం సంబంధం ఉందంటూ ప్రశ్నించాడు. ఈ దొరసానికి మాకు ఎలాంటి రిలేషన్ లేదన్నాడు.
దీనిపై ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో బీఆర్ఎస్ ను ప్రత్యక్షంగా లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన ఆరోపణలు చేయడం గులాబీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. తను తెలంగాణ జాగృతి సంస్థను తిరిగి బలోపేతం పై ఫోకస్ పెట్టింది. బీసీలపైనే ఫోకస్ పెడుతోంది. ఆ దిశగా అడుగులు వేసినా ఏ మేరకు వర్కవుట్ అవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంత జరుగుతున్నా అటు సోదరుడు కేటీఆర్ కానీ ఇటు తండ్రి కేసీఆర్ కానీ మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం , స్వంత పార్టీ నుంచి సీనియర్ లీడర్లు జంప్ కావడం, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందోన్న ప్రచారం ఊపందు కోవడంతో ఉద్యమ నాయకుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు సమాచారంం. మరో వైపు రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నాడు. తన సీటుకు ఎసురు వస్తుండడంతో ఎలాగైనా సరే కేసీఆర్ ను జైలు పాలు చేయాలని , తనకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవాలని కసితో ఉన్నడు. ఈ తరుణంలో కేసీఆర్ ఎపిసోడ్ పక్కన పెడితే కవిత పొలిటికల్ ఫైల్స్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. గులాబీ పార్టీకి కంట్లో నలుసుగా మారిన కవితపై బాస్ ఏం చేస్తాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.