
వందేళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. ఎప్పుడు అలలు వస్తాయో , సునామీ ముంచుకొస్తుందో, ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. ఆ పార్టీలో హై కమాండే కీలకం. దేశంలో ఎక్కడ, ఏరాష్ట్రంలో పవర్ లో ఉన్నా లేక పోయినా రిమోట్ కంట్రోల్ మాత్రం వారి చేతుల్లోనే ఉంటుంది. ఇది మొదటి నుంచి వస్తున్న కథే. ఎవరికి ఎప్పుడు అందలం దక్కుతుందో, ఇంకెప్పుడు తమ పదవి పోతుందో చెప్పలేం. ఉమ్మడి ఏపీలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది. ఇటు తెలంగాణలో అటు ఏపీలో. ఈ సమయంలో గులాబీ పార్టీ సాగించిన దొరల పాలన నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలను విముక్తం చేసింది. అధికారంలోకి వచ్చింది. మరోసారి ఒక సామాజిక వర్గానికి చెందిన వారే అధికారంలో కొనసాగుతూ ఉండడం ఒకింత ఇబ్బందిగా మారింది కాంగ్రెస్ పార్టీకి. లెక్కలేనన్ని హామీలు ఆ పార్టీ పవర్ లోకి వచ్చేలా చేసినా సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి సాగిస్తున్న పాలన, ఏకపక్ష ధోరణి ఇబ్బందిగా మారింది. పార్టీలో మొన్నటి దాకా రెండు వర్గాలు ఉండేవి. ఇప్పుడు మూడు గ్రూపులుగా మరాయి. ఒక గ్రూప్ సీఎం కు చెందినది కాగా మరో గ్రూప్ పాత కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలది, ఇంకో గ్రూప్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ది అన్న ప్రచారం జోరందుకుంది ఆ పార్టీలో. ఇది పక్కన పెడితే రేవంత్ ను , ఆయన వ్యవహార శైలి, మాటలతీరు చర్చలకు దారి తీసేలా చేసింది.
పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. మొన్నటికి మొన్న కేబినెట్ విస్తరణ జరిగింది. సీఎం సూచించిన వారి కంటే ఇతరులకే పోస్టులు దక్కాయి. ప్రస్తుతం స్తానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల పై వేటు వేయాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిబంధకంగా తయారైంది. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు
ప్రవేశ పెట్టడం, తేనె తుట్టెను కదిలిచింది. ఆరు గ్యారెంటీల అమలులో అలసత్వంతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాలేశ్వరం కమిషన్ లొల్లి ..ఇలా ప్రతీదీ ప్రభుత్వం ముందున్నాయి. ఈ క్రమంలో మంత్రి పదవులను ఆశించిన వారు అసంతృప్త రాగం మొదలు పెట్టారు. వారిలో ఎక్కువ స్వరం వినిపిస్తున్నది ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన అన్నదమ్ములు ఒకరు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాగా మరొకరు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సమయంలో తను పార్టీలో చేరినప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తానంటేనే చేరానని, తనకు మినిష్టర్ పోస్ట్ ఇవ్వకపోతే ఎలా అని బహిరంగంగానే ప్రశ్నించారు.
ఆపై సంచలన ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు ఏకంగా బలమైన సీఎం రేవంత్ రెడ్డిపై. తన భాష తీరు బాగోలేదని, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వల్లనే మనం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని అది గుర్తిస్తే మంచిదన్నారు రాజగోపాల్ రెడ్డి. ఆపై నీ బండారం బయట పెడతానంటూ ప్రకటించాడు. రాష్ట్రంలో ఆంధ్రా అధికారులు, వ్యాపారులు, కాంట్రాక్టర్ల రాజ్యం నడుస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. త్వరలోనే రేవంత్ బాగోతం, బండారాన్ని బయట పెడతానంటూ చెప్పాడు. అధికారంలో ఉంటూనే ప్రతిపక్షంగా మారాడు. సీఎం తన భాష మార్చు కోవాలని హితవు పలికాడు. నువ్వు ఉండేది కేవలం మూడేళ్లేనని ఆ తర్వాత అధికారం శాశ్వతం కాదన్నాడు. సీఎం ఒక్కడి వల్లనే కాంగ్రెస్ పవర్ లోకి రాలేదని, తమ లాంటి వాళ్లు, నిరుద్యోగులు , జర్నలిస్టులు పోరాడితే వచ్చిందన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వెనుక ఏపీ పెట్టుబడిదారులు ఉన్నారని, ఆ 20 మంది ఎవరో వారి పేర్లు బయట పెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇంత జరుగుతున్నా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కానీ హైకమాండ్ కానీ ఏ ఒక్క మాట మాట్లాడక పోవడం విస్తు పోయేలా చేసింది. ఈ తరుణంలో కర్ణాటక రాజకీయాలను ఒంటి చేత్తో శాసిస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను హైదరాబాద్ లో ఓ హోటల్ లో రాజగోపాల్ రెడ్డి చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారంది. తాను ఎవరి కాళ్లు మొక్కే రకం కాదన్నారు. తాను స్వచ్ఛమైన తెలంగాణ వాదినని, ఆత్మ గౌరవానికి భంగం కలిగితే చూస్తూ ఊరుకోనని ప్రకటించాడు. ఒకవేళ పదవే కావాలని అనుకుంటే ఆనాడే కేసీఆర్ ఇచ్చేవాడన్నారు. మరో వైపు సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ కు సపోర్ట్ గా నిలవడం కాంగ్రెస్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. త్వరలో కేబినెట్ విస్తరణ ఉందనే సమయంలో కోమటిరెడ్డి చేస్తున్న రచ్చ తనకు ప్లస్ పాయింట్ కానుందా లేక తనకే ఎసరు పెట్టనుందా అనేది త్వరలో తేలనుంది. ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన డీకే మంత్రాంగం ఫలిస్తుందా లేక రాజగోపల్ రెడ్డి రాజసంగా మీసం మెలేస్తారా అనేది తేలాలంటే వేచి చూడాలి.