
మరోసారి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు జస్టిస్ యశ్వంత్ వర్మ. ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటన చేశారు. తనపై నమోదైన నోట్ల దగ్ధం కేసుకు సంబంధించి ముగ్గురితో కూడిన దర్యాప్తు ప్యానల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జస్టిస్ వర్మపై వచ్చిన అభియోగాలు మామూలువి కావని, తీవ్రమైనవి కాబట్టి ఆయన తొలగింపు ప్రక్రియ ప్రారంభించాలని బిర్లా స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయవాది బి.వి. ఆచార్యలు ఉన్నారు. కమిటీ వీలైనంత త్వరగా తన నివేదికను సమర్పించాలని ఆదేశించారు. విచారణ కమిటీ నివేదిక అందే వరకు ప్రతిపాదన (జస్టిస్ వర్మ తొలగింపు) పెండింగ్‌లో ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని జస్టిస్ వర్మ నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దొరికాయి. కొన్నింటిని కాల్చి వేశారు. ఈ ఘటన కలకలం రేపింది. భారత దేశ న్యాయవ్యవస్థలో లొసుగులను బయట పెట్టేసేలా చేసింది.
కాగా చర్చకు దారితీసేలా చేసిన ఈ జస్టిస్ యశ్వంత్ వర్మ ఎవరు. ఆయనపై నిజంగానే చర్యలు తీసుకుంటారా. లేక మిగిలిన కేసుల లాగానే తాత్సారం చేస్తారా అన్నది అనుమానంగా ఉంది. వర్మ 1969లో పుట్టారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 1992లో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. 2014 అక్టోబర్ లో బెంచ్ కు పదోన్నతి పొందే ముందు అలహాబాద్ హైకోర్టులో స్పెషల్ కౌన్సెల్, చీఫ్ స్టాండింగ్ కౌన్సెల్ వంటి పదవులు నిర్వహించారు. అక్టోబర్ 2021 నుండి ఏప్రిల్ 2025 వరకు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పని చేశారు యశ్వంత్ వర్మ. తన నివాసంలో భారీ ఎత్తున , లెక్కించ లేనంతగా నోట్ల కట్టలు దగ్దం అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇదంతా ఆయన ఇచ్చిన అనుకూలమైన తీర్పులకు లభించిన నజరానా అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిని జస్టిస్ వర్మ ఖండించారు. ప్రజా ప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు మోదీ సర్కార్ తాత్సారం చేసింది.
జస్టిస్ వర్మ ఇంట్లో దొరికన నోట్ల కట్టలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియ చేయాలని కోరుతూ ఒకరు పిల్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సైతం చూసీ చూడనట్లు వదిలి వేసింది. ఆపై తనను ఢిల్లీ హైకోర్టు నుంచి ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అవినీతి, అక్రమాలకు పాల్పడిన తనను హైకోర్టుకు రానిచ్చే ప్రసక్తి లేదంటూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు వార్నింగ్ ఇచ్చారు. అయినా సుప్రీంకోర్టు కొలీజియం వినిపించుకోలేదు. తనను అక్కడికి బదిలీ చేసింది. ఈ ఏడాది మార్చిలో జస్టిస్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్ రూమ్ లో భారీ ఎత్తున నోట్ల కట్టలు ఉండడం, అవి షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయినట్లు చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇది మరింత పెద్దది కాకుండా ప్రభుత్వంలోని పెద్దలు, న్యాయమూర్తులు కలిసి పోలీస్ బాసులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పూర్తిగా న్యాయ వ్యవస్థపైనే నమ్మకం పోయేలా ఉందని భావించింది సర్వోన్నత న్యాయస్థానం.
జస్టిస్ షీల్ నాగు, జీఎస్ సంధవాలియా, అను శివరామన్ లతో అంతర్గతంగా విచారణ కమిటీని నియమించింది. న్యాయ పరమైన తొలగింపు ప్రక్రియను ప్రారంభించాలని నివేదిక సమర్పించింది. జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టులో అంతర్గత కమిటీ రిపోర్టును సవాల్ చేస్తూ రాజ్యాంగ పరమైన ఆందోళనలను లేవనెత్తారు. విచారణ చేపట్టిన ధర్మాసనం తన పిటిషన్ ను తిరస్కరించింది. పార్లమెంట్ లో జస్టిస్ వర్మ నిర్వాకంపై ఎంపీలు చర్చకు ప్రతిపాదించారు. కానీ బీజేపీ సర్కార్, స్పీకర్ ఒప్పుకోలేదు. ప్రతిపక్షాలు చివరి వరకు ప్రయత్నం చేశాయి. మొత్తం 146 మంది సభ్యులు జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు సంతకాలు చేసి స్పీకర్ కు ఇచ్చారు. దీంతో గత్యంరం లేక తను కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ ప్యానల్ సాక్ష్యాలను సేకరిస్తుంది. అయితే జస్టిస్ వర్మపై చర్యలు తీసుకోవాలంటే పార్లమెంట్ ఉభయ సభలలో (లోక సభ , రాజ్యసభ) మూడింట రెండవ వంతు మెజారిటీ సభ్యులు ఓకే చెప్పాల్సి ఉంటుంది.
ఇంతకూ జస్టిస్ యశ్వంత్ శర్మపై చర్యలు తీసుకునే అధికారం పార్లమెంట్ కు ఉన్నప్పటికీ సాధ్యమవుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక రకంగా చెప్పాలంటే ఇది అత్యంత కఠినమైన ప్రక్రియ. చట్టాలు అంత బలంగా ఉన్నాయి. జడ్జీలు ఒకసారిగా నియామకం అయ్యాక వారిని ఏకపక్షంగా తొలగించేందుకు వీలు కుదరదు. వారిని తొలగించాలటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 1124(4) , ఆర్టికల్ 217ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా పార్లమెంటరీ అభిశంసన ప్రక్రియ ద్వారా మాత్రమే తొలగించేందుకు మాత్రమే వీలు కుదురుతుంది. ఈ ప్రాసెస్ పూర్తయ్యేందుకు చాలా కాలం పడుతుంది. ముందు ప్యానల్ రిపోర్టు, పార్లమెంట్ లో చర్చ, అక్కడ ఆమోదం పొందాక చివరకు రాష్ట్ర పతి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంత జరిగినా కూడా చివరకు ప్రెసిడెంట్ గనుక ఒప్పుకోక పోతే జస్టిస్ వర్మపై చర్యలు తీసుకునేందుకు వీలుండదు. ఈ దేశంలో న్యాయమూర్తిని తొలగించాలంటే రెండు కారణాలు నిరూపించ బడాల్సి ఉంటుంది.
తన విధుల్లో అసమర్థత కనబరిస్తే, అవినీతి, అధికార దుర్వినియోగం లేదా అనైతిక ప్రవర్తనకు పాల్పడితేనే చర్యలు ఉంటాయి. ఇక ఇప్పటి వరకు పలువురు జడ్జీలపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టారు. కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 1993లో జస్టిస్ రామస్వామిపై అభిశంసన ప్రక్రియ స్టార్ట్ చేశారు. కానీ మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించలేదు. దీంతో ఆయన బతికి బయట పడ్డాడు. 2011లో అవినీతి ఆరోపణలపై కోల్ కతా హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ సౌమిత్ర సేన్ పై అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించింది. దీంతో ఆయన స్వచ్చంధంగా రాజీనామా చేశాడు. 2015లో రిజర్వేషన్లపై వివాదాస్పద కామెంట్స్ చేశారంటూ గుజరాత్ జడ్జి జస్టిస్ జేబీ పార్తివాలా పై 58 మంది ఎంపీలు అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టారు. కానీ వర్కవుట్ కాలేదు. 2017లో జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి దుష్ప్రవర్తన ఆరోపణలపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టారు రాజ్యసభలో. కానీ వీగి పోయింది. 2018లో తొలిసారి సీజేఐగా ఉన్న జస్టిస్ దీపక్ మిశ్రా 71 మంది రాజ్యసభ సభ్యులు తీర్మానం ప్రవేశ పెట్టగా అప్పటి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు.
సిక్కిం జస్టిస్ పీడీ దినకరన్ అవినీతి, భూ కబ్జా , న్యాయ పరమైన దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొన్నారు. అభిశంసన ప్రక్రియ ప్రారంభిచక ముందే తప్పుకున్నారు. 2024లో జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలపై 55 మంది ఎంపీల బృందం అభిశంసన అభ్యర్థనను సమర్పించింది. ఇంకా ఆమోదించ లేదు స్పీకర్. ఇక జస్టిస్ వర్మ నివాసంలో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సభ్యులతో జ్యూడీషియల్ ప్యానల్ ఏర్పాటు చేశారు. ఈ కేసు మరోసారి న్యాయ పరమైన జవాబుదారీతనం ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. భారత దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఒక్క న్యాయమూర్తిపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. చట్టాలలోని లొసుగులు, పార్లమెంటరీ వ్యవస్థలో పేరుకు పోయిన రాజకీయ ప్రమేయం అవినీతి తిమింగలాలను, అనకొండలను రక్షించేలా చేస్తున్నాయి. ధర్మ దేవత కళ్లు మూసుకుందా లేక న్యాయం ఎండ మావిగా మారనుందా అనేది తేలాల్సి ఉంది.