
ఈ దేశంలో మౌలిక వసతులన్నీ బడా బాబులకు బహిరంగంగానే అప్పజెప్పే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనత మోదీ, బీజేపీ సర్కార్ కు దక్కుతుంది. లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన అత్యంత దారుణమైన, హేయ్యమైన, బహిరంగ దోపిడీకి ఊతం ఇచ్చిన చరిత్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ది. గత కొంత కాలంగా ప్రభుత్వ రంగ సంస్థలు సరిగా నడవడం లేదన్న సాకుతో ఉన్నపళంగా ప్రైవేటీకరణ చేయడం ప్రారంభించింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు చెందిన ఆస్తులను అమ్మే హక్కు కానీ లేదా వ్యాపారవేత్తలకు బదలాయించడం నేరం. కానీ ఇప్పుడు అన్ని వ్యవస్థలు ఇద్దరి చేతుల్లో ఉన్నాయి. వారిలో ఒకరు మోదీ కాగా మరొకరు అమిత్ షా. ఈ ఇద్దరికి ఆత్మీయులు ఇద్దరు ఉన్నారు. ఒకరు అదానీ మరొకరు అంబానీ. వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్నేళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కాంల కంటే మోదీ కొలువు తీరిన పాలనా కాలంలో జరిగిన ఆర్థిక నేరాలు, మోసాలు, బడా వ్యాపారవేత్తల బహిరంగ దోపిడీ, మౌలిక వసతులను గంప గుత్తగా అప్పగించింది ఎక్కువే జరిగి
143 మంది భారతీయులను మతం పేరుతో విడదీసి పక్కా ప్లాన్ తో దోచుకుంటున్న వైనం బాధాకరం. ఇప్పటికే ఓడ రేవులు, ఎయిర్ పోర్టులు, చివరకు ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీలపై అదానీ, అంబానీల కన్ను పడింది. గతంలో ఏపీలో జగన్ ఉన్నా ఏమీ చేయలేక పోయాడు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నా నోరు మెదపడం లేదు. ఒక్క వైఎస్ షర్మిల, జేడీ లక్ష్మీ నారాయణతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు గొంతు విప్పుతున్నారు. కేంద్రం నిర్వాకంపై మండిపడుతున్నారు. కానీ వీరి శక్తి చాలదు. బలమైన మోదీ ముందు. ఘనమైన చరిత్ర కలిగి ఉంది విశాఖ ఉక్కు కర్మాగారం. ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎందుకని దీనిపై ఇంతటి ఆసక్తి. అంటే వేల కోట్ల విలువ చేసే ఆస్తులు దీని స్వంతం. దీనిని లోపాయికారీగా అదానీకి అప్పగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ దేశంలోనే ప్రధానమైన ఉక్కు ప్లాంటుగా ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ప్రాణాలు బలి ఇచ్చారు.
దీనిని 1971లో అప్పటి ప్రధాని ఇందిర ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంటు 1992 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. 2021లో కేంద్ర సర్కార్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఆర్ఐఎన్ ఎల్ లో ప్రభుత్వ వాటా మొత్తం ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలని నిర్ణయించింది. రూ. 20 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయనే సాకును చూపించి ప్రైవేట్ పరం చేసేందుకు రెడీ అయ్యింది. వేలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పని చేస్తున్నారు. వేలాది మంది రోడ్డున పడ్డారు. ప్రైవేటీకరణకు బదులు ఫిన్ టెక్ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నారు. లాభదాయకమైన ముడి పదార్థాల బ్లాకులు కేటాయిస్తే విశాఖ స్టీల్ తిరిగి లాభాల్లోకి వస్తుందని అంటున్నా పట్టించు కోవడం లేదు మోదీ . అప్పులను ఈక్విటీలుగా మార్చే ఛాన్స్ ఉందన్నా కూడా డోంట్ కేర్ అంటున్నారు.
ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్నారు. కార్మికులు ఆందోళనలు, సమ్మెలు చేస్తున్నా పట్టించు కోవడం లేదు. ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిలుక పలుకులు పలికారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయనీయమని పేర్కొన్నారు. ముడి పదార్థాల లోటు, అంతర్జాతీయ ఉక్కు ధరల మార్పులు కారణంగా కర్మాగారం తరచూ నష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ విశాఖ నగర అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి కీలకంగా మారింది. మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా 2021 నుంచి ఉద్యమం ఊపందుకుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ కానే కాదని అది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా పేర్కొంటున్నా తాజాగా పుండు మీద కారం చల్లినట్లు ప్రైవేటీకరణ దిశగా టెండర్లను పిలిచింది విశాఖ స్టీల్ ప్లాంటు. ఏకంగా ఒకే రోజు 12 విభాగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం విస్తు పోయేలా చేసింది.
ఇందులో భాగంగా 210 మెగావాట్ల కేప్టివ్ పవర్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు టెండర్స్ ఇచ్చింది. ప్రైవేట్ ఆపరేటర్లు సెప్టెంబర్ 9 లోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరింది. దీంతో పాటు థర్మల్ పవర్ ప్లాంట్, ఎస్ఎంఎస్ – 1, 2, 3, ఎంఎంఎస్ఎం, ఎస్‌బిఎం, డబ్ల్యుఆర్ఎం 1, 2, 6 విభాగాలు, మాదారం మైన్స్, రోల్ షాప్ అండ్ రిపేర్ షాప్ – 1, 2, 8, సెంట్రల్ మిషన్ షాప్ , ఫౌండ్రీ, ఎస్‌టిఎం, ఇఎన్ఎండి, బ్లాస్ట్ ఫర్నేస్ 1, 2, 3 తదితర విభాగాలకు టెండర్లు పిలిచింది. 10వ తేదీ 3 గంటల తర్వాత దరఖాస్తులు తెరుస్తారు. ఆ తర్వాత వీటిని ప్రైవేట్ పరం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఆర్ఎంహెచ్‌పి, సింటర్ ప్లాంట్ మెయింటెనెన్స్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు టెండర్లు పిలిచారు. విచిత్రం ఏమిటంటే 12 కీలక విభాగాలకు టెండర్లు ఖరారైతే రాబోయే రోజుల్లో మెల మెల్లగా పొమ్మనకుండా పొగ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది కేంద్రం. చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ లు ఉప రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తామని ప్రకటించారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి నోరు మెదపడం లేదు. ఈ టెండర్ల వ్యవహారం చివరకు స్టీల్ ప్లాంట్ ను గంప గుత్తగా అమ్మేందుకే ప్లాన్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రేపు కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.