
మధురై జనసంద్రంగా మారడం వింతేమీ కాదు. ఎందుకంటే చిటికె వేస్తే చాలు వేలాది మంది తన కోసం ఏం చేయమన్నా చేసేందుకు సిద్ధం. ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనుకాడని అత్యధిక అభిమానులు ఉన్న అతి కొద్ది మంది కోలీవుడ్ నటులలో జోసెఫ్ విజయ్ అలియాస్ దళపతి విజయ్ ఒకరు. ఈ దేశంలో భాషాభిమానం కలిగిన ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తమిళనాడు ఒక్కటే. ఆ ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. అక్కడ నాస్తికత్వం ఉంది..అదే సమయంలో భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. ఆధ్యాత్మికతకు ఆలవాలంగా నిలిచింది. ఇక్కడ వ్యక్తి పూజ ఎక్కువ. తమిళ ప్రజలు తమకు నచ్చితే ప్రాణం ఇస్తారు. వారి కోసం ఏమైనా చేస్తారు. కానీ ఎవరూ ఊహించని విధంగా దళపతి విజయ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. గతంలో ఎందరో తమదైన ముద్ర కనబరిచారు. కొందరు పార్టీలను ప్రారంభించారు. మరికొందరు ప్రారంభించి ఆదిలోనే వర్కవుట్ కాదని చేతులెత్తేశారు. ప్రత్యేకించి స్టార్ ఇమేజ్ స్వంతం చేసుకున్న ఏకైక నటుడు రజనీకాంత్. ఇలయ నాయగన్ అని ముద్దుగా పిలుచుకునే కమల హాసన్.
కానీ ఎందుకనో ఏమైందో కానీ ఉన్నట్టుండి సినీ తెరపై ఇంకా ఎంతో అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ రణ రంగంలోకి, చదరంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్. దేశ చరిత్రలో పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి రావడం రాజకీయ వర్గాలను ప్రత్యేకించి తమిళ పొలిటికల్ లీడర్లను విస్తు పోయేలా చేసింది. గతంలో కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత, శశికళ లాంటి ఉద్దండ రాజకీయ నాయకులను, నాయకురాళ్లను చూసింది. జయలలితతో పాటు ఖుష్బూకు కూడా ఇక్కడ గుడి కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ కీలక సమయంలో టీవీకే పార్టీని స్థాపించి ఏడాది పూర్తయింది. చాలా ప్లాన్ గా వెళుతూ ఉన్నాడు. చాప కింద నీరులా రాష్ట్రమంతటా తన బలగాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతున్నాడు. తన వెనుక ఉన్నది ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. తనతో ఒప్పందం చేసుకున్నాడు.
గతంలో తమిళనాడులో డీఎంకే పార్టీకి సపోర్ట్ చేశాడు. అన్నాడీఎంకేను దించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు విజయ్ ను తమిళనాడుకు దళపతిని చేయాలని కసరత్తు ప్రారంభించాడు. ఈసారి ప్రసంగం చాలా కీలకమైనది. ప్రత్యేకించి సిద్దాంత పరంగా భారతీయ జనతా పార్టీని, పార్టీ పరంగా డీఎంకేను ఏకి పారేశాడు. విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నీట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశాడు. తమిళనాడుకు స్వంత ఇమేజ్ ఉందని, దానిని డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు వేదిక పైనుంచి మోదీ, అమిత్ షాకు. ఇదే సమయంలో సీఎం స్టాలిన్ పై మండిపడ్డాడు. ఆయన పాలన వేస్ట్ అంటూ పేర్కొన్నాడు. ఇలాంటి పాలకులు ఉంటే తమిళనాడు మరో కొన్నేళ్లు వెనక్కి వెళుతుందన్నాడు.
మధురై వేదికగా జరిగిన పార్టీ సభకు ఏకంగా 4 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇది అధికార పార్టీని పునరాలోచనలో పడేసింది. రోజు రోజుకు విజయ్ ప్రత్యామ్నాయంగా మారడం ఒకింత ఇప్పటికే కొలువు తీరిన పార్టీలను విస్తు పోయేలా చేస్తోంది. తాను తగ్గేదేలే అంటూ స్పష్టం చేశాడు విజయ్. ఇప్పటికే రాష్ట్రంలో డీఎంకే పార్టీ అధికారంలో ఉంది. గతంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ సంకీర్ణ సర్కార్ కు వ్యతిరేకంగా తను కీలక వ్యాఖ్యలు చేశాడు విజయ్. అప్పట్లో తను సైకిల్ పై వెళ్లి ఓటు వేశాడు. అది ఓ సంచలనం రేపింది దేశ వ్యాప్తంగా. లక్షలాది మందికి ఆయన ఆరాధ్య దైవంగా ఉన్నాడు. తనను ఆప్యాయంగా దళపతి అని పిలుచుకుంటారు తమిళనాడులో. తను ఏ సినిమా చేసినా అందులో సామాజిక సందేశం ఉండేలా చూశాడు . ఈ మధ్యన పదే పదే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రజాస్వామ్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అంతే కాదు విద్య, వైద్యం, ఉపాధి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని , తీసుకుంటున్న నిర్ణయాలను బహిరంగంగానే విమర్శించాడు.
తను నటించిన మెర్సిల్ లో వీటి గురించి ప్రశ్నించాడు. ఇక సర్కార్ చిత్రంలో ఓటు విలువ ఏమిటో చెప్పే ప్రయత్నం చేశాడు. ఇవాళ ఓటు ఎంతటి శక్తి వంతమైనదో చెప్పేందుకు కృషి చేశాడు విజయ్. తన వాయిస్ ను, తన ఆలోచనలను బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా ప్లాన్ చేశాడు. ఆ దిశగా విజయ్ పార్టీ వెనుక నలుగురు పని చేస్తున్నారు. వారంతా ఆయనకు బలం చేకూర్చే పనిలో పడ్డారు. వచ్చే 2026లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు జోసెఫ్ విజయ్. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీతో పాటు మరికొన్ని పార్టీలతో తమిళ వెట్రీ కజగం (టీవీకే) పోటీ పడబోతోంది. ఏ మేరకు తను సక్సెస్ అవుతాడనేది చర్చనీయాంశంగా మారింది. చాయ్ పే చర్చా పేరుతో మోదీని ప్రధాని చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఎలా దళపతిని పవర్ లోకి తీసుకు వస్తాడనేది వేచి చూడాలి. ఇతర పార్టీల నుంచి ఓటర్లను ఆకర్షించడం, ఉన్న వారిని తమ వైపు తిప్పుకునేలా చేయడంపైనే దృష్టి సారించాడు పీకే.
అభిమానం వేరు ఓట్లను రాబట్టు కోవడం వేరు. కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నప్పటికీ బూత్ ల వద్దకు వచ్చి ఓట్లు వేస్తారా అన్నది ప్రశ్న. మరో వైపు బీజేపీ పావులు కదపడం స్టార్ట్ చేసింది. ఈసారి డీఎంకేను అధికారంలోకి రాకుండా చూడాలంటే తమతో కలిసి వచ్చే అన్ని పార్టీలను చేర్చు కోవాలనేది అమిత్ షా వ్యూహం. దళపతి కొత్త పార్టీ రావడం వల్ల తమకే లాభం కలుగుతుందని షా భావిస్తున్నారు. ఇప్పట్లో బీజేపీ తమిళనాట పవర్ లోకి వచ్చేది కల్ల. అందుకే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఏపీలో లాగా ఇక్కడ అధికారంలోకి రావాలన్నది మాస్టర్ ప్లాన్ వేశాడు ట్రబుల్ షూటర్. దీనిని ముందే పసిగట్టిన ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు పదును పెట్టాడు. విజయ్ ను కార్యోన్ముఖుడిని చేసే పనిలో పడ్డాడు. రాబోయే శాసన సభ ఎన్నికలు తమిళనాడులో ఎవరికి పట్టం కడతాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. విజయ్ దళపతి అవుతాడా లేక కమల్ హాసన్ , రజనీకాంత్ లాగా మిగిలి పోతాడా అన్నది వేచి చూడాలి.