
మానవ జాతికి ప్రాణం పోసేన చరిత్ర మహిళా మణులది. అలాంటి మహిళా జాతికి చెందిన వ్యక్తి అయి ఉండి కూడా అత్యంత దారుణంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకురాలు స్మృతి ఇరానీ మాట్లాడటం అత్యంత బాధకు గురి చేసింది. ఎక్కడ చూసినా ఆమె తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. యువతి దశ ప్రారంభమైనప్పటి నుంచి మోనోపాజ్ స్థితి వచ్చేంత దాకా మహిళలు సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటారు. వారు పడుతున్న వేదన దారుణంగా ఉంటుంది. కానీ వారి గురించి చులకనగా మాట్లాడటం , పదే పదే ప్రస్తావిస్తూ రావడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. దేశ అభివృద్దిలో, సమాజంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు మహిళలు. పెద్దల సభలో స్త్రీలకు రుతు క్రమం వచ్చే ఆ సమయంలో సెలవు ఇవ్వాలని కోరారు ఎంపీ.
రుతు క్రమం అనేది వైకల్యం కాదని , అది సహజ సిద్దంగా జరిగేది అంటూ చులకన చేస్తూ మాట్లాడారు బహిరంగంగానే స్మృతీ ఇరానీ. మహిళల జీవిత ప్రయాణంలో ఇది తప్పనిసరి అని దీనిని సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం కాదని కొట్టి పారేసే ప్రయత్నం చేశారు. వేతనంతో కూడిన పీరియడ్ లీవ్స్ ఇస్తే వివక్షకు దారి తీసేలా చేస్తుందంటూ పేర్కొనడం ఆమె అవగాహన రాహిత్యాన్ని సూచిస్తోంది. దీనిని వ్యతిరేకించడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు మహిళలు. దేశంలో సగ భాగానికి పైగా ఉన్న మహిళలకు, యువతులకు, బాలికలకు నెల నెలా వచ్చే రుతుక్రమం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఎంపీ మనోజ్ కుమార్ ఝా. రుతుక్రమాన్ని వికలత్వంగా పరిగణించ లేమంటూ స్పష్టం చేసింది సర్కార్. బహిష్ట సెలవులు శ్రామిక శక్తిలో ఒక భాగం అవుతాయే తప్పా దీనిని స్పెషల్ గా పరిగణించ లేమంటూ చెప్పడం బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోంది. ఒక రకంగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సర్కార్ మహిళల పట్ల దారుణంగా వ్యవహరిస్తూ వస్తోంది.
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని బయటకు తీసుకు వచ్చింది.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీకి వత్తాసు పలికింది. జనం ఛీకొట్టినా, చీదరించుకున్నా బేషరతుగా , నిస్సిగ్గుగా మద్దతు తెలిపింది. దీనిపై తీవ్రంగా స్పందించింది భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. బహిష్టు పరిశుభ్రత విషయంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత సర్కార్ పై ఉందని కుండ బద్దలు కొట్టింది. ఎంహెచ్ఎంవై పథకాన్ని రూపొందించినా ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదు. మొత్తంగా దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మహిళలు నెల నెలా వచ్చే రుతుక్రమం సమయంలో పెయిడ్ లీవ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని సర్వత్రా కోరుకుంటోంది. దీనిని వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యగా పరిగణిస్తేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోసారి కేంద్రం తన వివక్షా పూరితమైన ధోరణిని వీడనాడాలి. స్త్రీలు అభివృద్దిలో భాగమై ఉన్నారు. వారిని అక్కున చేర్చుకోవాలి. అప్పుడే సమాజం అభివృద్ది వైపు చూస్తుందని గుర్తుంచు కోవాలి.