
అక్రమార్కులకు, అవినీతి పరులకు, రియల్ ఎస్టేట్ దళారులకు, మోసగాళ్లకు, వైట్ కాలర్ నేరాలకు కేరాఫ్ గా మారింది తెలంగాణ రాజధాని హైదరాబాద్. ఐటీ, లాజిస్టిక్, రియల్ ఎస్టేట్, ఫార్మా, సినీ రంగాలకు హబ్ గా ఉన్న ఈ సిటీ ఇప్పుడు అందినంత మేర దోచుకునేందుకు అక్షయపాత్రగా మారింది. ఇక్కడ భూమి ఉండటం ఓ ఫ్యాషన్, స్టేటస్ సింబల్ కూడా. నిజాం కాలం నాటి నుంటి నేటి రేవంత్ రెడ్డి వరకు ఈ నగరం ప్రాధాన్యత సంతరించుకుంది. భిన్న సంస్కృతులకు కేరాఫ్ గా నిలిచింది. అంతకు మించి చలన చిత్ర పరిశ్రమ ఇండియాలోనే టాప్ లో కొనసాగుతోంది. ఇక్కడి నటీ నటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు ప్రత్యేకత కలిగి ఉన్నారు. ఇక పారితోషకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓవైపు హీరోలు, నిర్మాతల ఆధిపత్యం కొనసాగుతుంటే ఇంకో వైపు సినీ రంగానికి ఆయువుపట్టుగా ఉన్న కార్మికులు 30 శాతం వేతనాలు కావాలంటూ ఆందోళన బాట పట్టారు. ఇది ఓవైపు నడుస్తుండగానే ఇంకో వైపు మూవీకి సంబంధించి చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ బాధితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇంతకు ఈ చిత్రపురికి కారణం ఎవరు అంటే తెలంగాణకు చెందిన మహానుభావుడు , దివంగత విలక్షణ నటుడు డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి. తను మనసున్న మారాజు. కాసింత జాగా దొరికితే కబ్జా చేసుకునే రోజుల్లో తనకు చెందిన 10 ఎకరాల స్థలాన్ని విరాళంగా ప్రకటించిన అరుదైన నటుడు.
తను 1953లో నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తిలో పుట్టాడు. డాక్టర్ గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత సినీ రంగంలోకి ఎంటర్ అయ్యారు. ప్రతి నాయకుడి పాత్రలకు పేరు పొందాడు. ‘జయప్రద ఫిల్మ్స్’ అనే తన సొంత బ్యానర్ కింద అనేక చిత్రాలను నిర్మించారు. ఆనాటి సీఎం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సినీ కార్మికుల కోసం ఇళ్ల నిర్మాణం కోసం 67 ఎకరాల భూమిని కేటాయించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వల్లనే ఇది సాధ్యమైంది. ఇందు కోసం ఇవాళ వేల కోట్లు విలువైన గచ్చి బౌలి సమీపంలో ఉన్న తనకు చెందిన స్వంత పదెకరాలను దానంగా ఇచ్చాడు. ఇప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారం లెక్కిస్తే రూ. 1000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. తను చేసిన సాయానికి గుర్తుగా చిత్రపురి కాలనీకి తన పేరు పెట్టారు. ఆ తర్వాత కాలనీ మెల మెల్లగా విస్తరిస్తూ వచ్చింది.
ఇక్కడి భూమి విలువైనది కావడంతో చాలా మంది కళ్లు దీనిపై పడ్డాయి. ఏకంగా చిత్రపురి హౌసింగ్ సొసైటీలో సుమారు రూ. 300 కోట్ల రూపాయల మేర భారీ కుంభకోణం జరిగిందంటూ సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న వల్లభనేని అనిల్ కుమార్ పై ఎద్ద ఎత్తున అవినీతి , ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి నిజమైన సినీ కార్మికులకు న్యాయం జరగడం లేదంటూ వాపోతున్నారు. ఇక్కడ ఫ్లాట్స్ ను నిర్మించారు. వీటిని బ్లాక్ మార్కెట్ లో కోట్లకు అమ్ముకుంటున్నారని తనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిత్రపురిలో మిగిలి పోయిన 2.5 ఎకరాలలో తమకు సింగిల్ , డబుల్ ఇళ్లను కాదని 1200 నుండి 4400 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ నిర్మాణాలు చేపట్టారు. వాటిని బయటి వ్యక్తులకు అమ్మేందుకు ప్లాన్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఈ అక్రమార్కులకు హెచ్ఎండీఏ, సీఎంఓ కార్యాలయంలోని అధికారులతో కుమ్మక్కయ్యారని మండి పడుతున్నారు సినీ కార్మికులు.
చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న వల్లభనేని అనిల్ కుమార్ పై ఇప్పటి వరకు 15 ఎఫ్ఐఆర్ లు, 10 ఛార్జ్ షీట్ లు నమోదు కావడంతో పాటు తను రెండు సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. బయటకు వచ్చినా అక్రమాలు ఆపక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది . రిట్ పిటిషన్ నెం. 18225/2021, 7642/2024, 9335/2025 ద్వారా ప్రస్తుత కమిటీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ అవినీతిపరులకు కొమ్ము కాసిందంంటున్నారు సినీ కార్మికులు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక తమకు న్యాయం జరుగుతుందని అనుకుంటే మొదటికే మోసం జరిగిందంటూ ఆవేదన చెందుతున్నారు. 25 ఏళ్లుగా ఈ సొసైటీలో 6,000 మంది డబ్బులు చెల్లించారు. అయితే కొత్తగా మరో 1000 సభ్యత్వాలు ఇవ్వాలని సొసైటీ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినీ కార్మికులు. వల్లభనేని కమిటీని రద్దు చేసి అడ్ హక్ కమిటీ వేయాలని కోరుతున్నారు. అర్హులైన సినీ కార్మికులకు , సభ్యులకు మాత్రమే ఇళ్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఇంత జరుగుతున్నా ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న నిర్మాత వెంకట రమణా రెడ్డి అలియాస్ దిల్ రాజు కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ కిమ్మనక పోవడం దారుణం. చలన చిత్ర పరిశ్రమ అంటే చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్, అల్లు అరవింద్ , రామ్ చరణ్ మాత్రమే కాదు వేలాది మంది సినీ కార్మికులు అన్న విషయం మరిచి పోతే ఎలా..? భారీ స్కాంలో ఎవరు ఉన్నారో తేల్చాలి. అసలైన బాధితులకు న్యాయం అందినప్పుడే ప్రభాకర్ రెడ్డి ఆత్మ శాంతిస్తుంది.