రాహుల్ గాంధీ ప‌ప్పు కాదు నిప్పు

రాజ‌కీయాల‌లో ఎవ‌రు ఎప్పుడు వెలుగు లోకి వ‌స్తారో ఎవ‌రూ చెప్ప‌లేరు. త‌న‌ను అంద‌రూ ప‌ప్పు అని గేలి చేశారు. పాలిటిక్స్ కు ప‌నికి రాడ‌న్నారు. గేలి చేశారు. అవ‌మానాల‌కు గురి చేశారు. స‌వాల‌క్ష ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ స‌మ‌యంలో త‌ను కొంత వెన‌క్కి జ‌రిగాడు. రాజ‌కీయ ర‌ణ రంగంలో నెట్టుకు రావాలంటే వ్యూహాలు కూడా అవ‌స‌ర‌మ‌ని, ఒక్కోసారి త‌గ్గిన‌ట్టు క‌నిపించాల‌ని గ‌మ‌నించాడు. చివ‌ర‌కు త‌న‌ను తాను నిజ‌మైన రాజ‌కీయ నాయ‌కుడిగా ప్రూవ్ చేసుకునే ప‌నిలో ప‌డ్డాడు 100 ఏళ్ల‌కు పైగా ఘ‌న‌మైన చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రాహుల్ గాంధీ. ఘ‌న‌మైన కుటుంబ నేప‌థ్యం, వార‌స‌త్వం క‌లిగిన త‌ను ఇప్ప‌టికీ ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై మాట్లాడుతున్నాడు. ప్ర‌ధానంగా త‌ను అత్యంత బ‌ల‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని, ఆయ‌న ప‌రివారాన్ని, త‌న‌కు వెన్ను ద‌న్నుగా నిలుస్తూ వ‌చ్చిన హిందూ భావజాలంతో ముడి ప‌డి ఉన్న బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను, ఏబీవీపీ, విహెచ్ పీ లాంటి సంస్థ‌ల‌ను ల‌క్ష్యంగా చేస్తూ వ‌చ్చాడు.

త‌న‌కు విదేశాల నుంచి మ‌ద్ద‌తు వ‌స్తోంద‌ని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వాటిని సైతం త‌ను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మ‌రోసారి సంచ‌ల‌నంగా మారాడు రాహుల్ గాంధీ. ప్ర‌ధానంగా భార‌త రాజ్యాంగాన్ని ఆయ‌న ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తూ వ‌స్తున్నారు. కానీ త‌మ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల‌లో దీనికి వ్య‌తిరేకంగా కొన‌సాగుతూ వ‌స్తోంది. కానీ ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేస్తుండ‌డం ఒకింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. రాహుల్ గాంధీని రాటు దేల్చేలా చేసింది మాత్రం రైతులు సాగించిన మ‌హోన్న‌త పోరాటం. ఆయ‌న‌ను క‌దిలించింది. బ‌హిరంగంగానే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. తాను కూడా పాల్గొన్నాడు. ఖాకీల దాష్టీకాన్ని ప్ర‌శ్నించాడు. లోక్ స‌భ సాక్షిగా త‌న‌తో పాటు మ‌రికొంద‌రు స‌భ్యుల‌తో క‌లిసి గొంతు క‌లిపాడు. చివ‌ర‌కు రైత‌న్న‌ల మ‌హోద్యమానికి త‌న‌కు ఎదురే లేద‌ని విర్ర‌వీగుతూ వ‌చ్చిన మోదీ త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు.

తాము తీసుకు వ‌చ్చిన బిల్లును ఉప సంహ‌రించు కుంటున్న‌ట్లు పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌క‌టించాడు. ఇది రాహుల్ కు మ‌రింత ప్రాధాన్య‌త క‌లిగించేలా చేసింది. ఆ త‌ర్వాత బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ నిర్వాకంపై , లైంగిక హింస‌కు వ్య‌తిరేకంగా మహిళా రెజ్ల‌ర్ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచాడు. త‌మ పార్టీ ప‌రంగా సీటు కూడా ఇప్పించాడు. మ‌ణిపూర్ లో చోటు చేసుకున్న మార‌ణ హోమం గురించి ప్ర‌శ్నించాడు.కేంద్రాన్ని నిల‌దీశాడు. త‌ను సంద‌ర్శించ‌డ‌మే కాదు బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించాడు. ఆ త‌ర్వాత అనాధ పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్నాడు రాహుల్ గాంధీ. ఇదే స‌మ‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్వాకాన్ని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట పెట్టాడు. బీహార్ లో అకార‌ణంగా తొల‌గించిన 65 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల జాబితా గురించి నిన‌దించాడు. త‌నతో పాటు ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్ కూడా తోడ‌య్యాడు. ఇద్ద‌రూ క‌లిసి
ప్ర‌జ‌ల ముందు ఉంచే ప్ర‌య‌త్నం చేశారు.

అంత‌కు ముందు క‌ర్ణాట‌క‌లో ఇటీవ‌ల జ‌రిగిన లోక్ స‌భ , అసెంబ్లీ స్థానాల‌లో దొంగ ఓట్ల బండారాన్ని బ‌య‌ట పెట్టాడు. ఓటు విలువ ఏమిటో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. తాను చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర రాహుల్ ను అరుదైన నాయ‌కుడిగా, ప్ర‌జా నేత‌గా మార్చేలా చేసింది. ఈ ఆలోచ‌న వెనుక ఉన్న‌ది మాత్రం యోగేంద్ర యాద‌వ్. ఈ యాత్ర కార‌ణంగా కాంగ్రెస్ కు ఆక్సిజ‌న్ నింపేలా చేసింది. ఈ ఓట్ల చోరీ గురించి సుప్రీంకోర్టులో ప్ర‌శాంత్ భూష‌ణ్‌, సింఘ్వీతో పాటు యోగేంద్ర యాద‌వ్ వాస్త‌వాల‌ను ధ‌ర్మాస‌నం ముందు ఉంచారు. దీనిపై సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది . కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. తొల‌గించిన ఓట‌ర్ల జాబితాను వెల్ల‌డించాల్సిందేన‌ని ఆదేశించింది. ఈ తీర్పు వెనుక న్యాయ‌వాదుల‌తో పాటు రాహుల్, తేజ‌స్వి ప్ర‌య‌త్నం ఉంద‌ని చెప్ప‌క త‌ప్పదు.

ఇందులో భాగంగా త్వ‌ర‌లో బీహార్ లో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఓటు విలువ ఏమిటో, వాటికి ఉన్న ప్రాధాన్య‌త ఏమిటో, రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు ఏమిటో తెలియ చెప్పేందుకు రాహుల్ గాంధీ కంక‌ణం క‌ట్టుకున్నాడు. ఇందు కోస‌మే బీహార్ లో ఓట్ అధికార్ యాత్ర పేరుతో శ్రీ‌కారం చుట్టాడు. అక్క‌డ రాబోయే ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి గెలుస్తుందా లేదా అన్న‌ది ప‌క్క‌న పెడితే రాహుల్ చేసిన ఈ యాత్ర ప్ర‌య‌త్నం ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకు వ‌స్తుంద‌ని మాత్రం చెప్ప‌క త‌ప్ప‌దు. ఓటు మన హక్కు మాత్రమే కాదు అది భవిష్యత్తును నిర్ణయించే శక్తి కూడా అనే నినాదంతో ముందుకు వెళుతున్న‌రాహుల్ గాంధీ అభినంద‌నీయుడు.కాదంటారా..

  • Related Posts

    భూమి పుత్రుడా..గాయ‌కుడా అల్విదా..!

    అస్సాం న‌గ‌రం జ‌న సంద్రంగా మారింది దుఖఃంతో. త‌మ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించేలా చేసింది. అశేష జ‌న‌వాహిని త‌న‌కు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హ‌జారికా గుర్తుకు…

    కుల వివ‌క్ష నిజం దేశానికి ప్ర‌మాదం

    ఈ దేశంలో కుల ర‌క్క‌సి కుట్ర‌ల‌కు తెర లేపుతోంది. కోట్లాది మాన‌వ స‌మూహాన్ని విభ‌జించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది అణ్వాయుధాలు, మిస్సైల్స్ కంటే అత్యంత ప్ర‌మాదాక‌ర‌మైన‌ది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *