
నిన్నటి దాకా మాటల తూటాలు పేల్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి ఏమైందో ఏమో కానీ మాట మార్చారు. ప్రతీసారి కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్ , కేటీఆర్ , హరీశ్ లను ఏకి పారేస్తూ వచ్చిన సీఎం ఉన్నట్టుండి నిరాశ పూర్వకమైన కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసేలా చేసింది. రాజకీయాలు చేయడం వేరు రాణించడం వేరు అన్నది ఆయనకు స్వానుభవంగా తెలుసు. దీనిని ఎవరూ కాదనలేని సత్యం. తెలంగాణలో ఒక బలమైన నాయకుడిగా పేరు పొందిన కేసీఆర్ ను , ఆయన పార్టీని ఓడించడం అంటే మామూలు విషయం కాదు. 10 ఏళ్ల పాలనలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం, రాచరిక పాలన, వివక్ష, దోపిడీ తో పాటు అహంకార పూరిత మనసత్వం కారణంగా గులాబీ పార్టీకి జనం పాతర వేశారు. హస్తాన్ని ఆదరించారు. అధికారంలోకి వచ్చేలా చేశారు. ఇక వందేళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ఊహించని రీతిలో చిన్న వయసులోనే కీలకమైన తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు.
ప్రజా పాలన అందిస్తామంటూ ప్రకటించారు. రాజకీయ ప్రయాణంలో పలు పదవులు నిర్వహించిన రేవంత్ రెడ్డి ఇంకా పాలనా పరంగా తనదైన ముద్ర వేయలేక పోయారు. సవాలక్ష సమస్యలతో ఉన్న ఈ ప్రాంతాన్ని నెట్టుకు రావడం అన్నది కత్తి మీద సాము చేయడం లాంటిది. ఈ జర్నీలో ఎంతో మంది రాజకీయ నాయకులు అలా వచ్చారు ఇలా వెళ్లిపోయారు. కాంగ్రెస్ పరంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆరోగ్యశ్రీతో ఆకట్టుకున్నారు. పాలనా పరంగా తన ముద్ర వేశారు. ప్రత్యేకించి తన పరివారానికి మేలు చేసినా ప్రజలతో ఆయన మమేకం అయిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా చేసింది. ఇక చంద్రబాబు నాయుడు కార్పొరేట్ కంపెనీకి సీఈఓగా పాలన సాగిస్తారన్న పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ప్రస్థానం జడ్పీటీసీగా ప్రారంభమైంది. ఎంపీగా, ఎమ్మెల్యేగా, చివరకు ముఖ్యమంత్రి పదవిని అధీష్టించేంత దాకా వెళ్లింది. సీఎం సీటుపై కూర్చున్న ఆయన చుట్టూ ఆంధ్రా లాబీయింగ్ , ప్రభావం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఇంటి పోరు ఎక్కువ. కేసీఆర్ లాంటి బలమైన నాయకుడిని ఖంగుతినిపించిన రేవంత్ రెడ్డి తన పార్టీలో అంతర్గత శక్తులను ఎదుర్కోవడంలో కొంత వెనుకంజ వేస్తున్నారు. ఓ వైపు వ్యక్తిగత ప్రచారంపై రేవంత్ రెడ్డి పెట్టిన శ్రద్ధ పాలనా పరంగా పెట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో గతంలో తెలంగాణ , ఉమ్మడి ఏపీ పాలనా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఢిల్లీకి ఏకంగా 50కి పైగా వెళ్లారు. విదేశీ పర్యటనలు, హైడ్రా పేరుతో పేదలు, సామాన్యుల, మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టడం, విద్యా, ఆరోగ్య పరంగా మాఫియా రెచ్చి పోవడం, ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం, బీసీల రిజర్వేషన్ల హామీ ప్రభుత్వానికి గుదిబండగా మారడం తలకు మించిన భారంగా మారింది. ఇప్పటి వరకు సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ రాజ్యాంగేతర శక్తిగా నారా చంద్రబాబు నాయుడే పాలన సాగిస్తున్నాడని విమర్శలు ఉన్నాయి. ఒకనాడు నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉమ్మడి ఏపీలో ఉద్యమాలు, ఆందోళనలు , పోరాటాలు చేసిన తెలంగాణ సమాజం మరోసారి దగా, దోపిడీకి గురయ్యేందుకు సిద్దం కావడం ఒకింత విస్తు పోయేలా చేసింది. టీడీపీ నుంచి వచ్చిన నేతలకే ప్రయారిటీ ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఇదే క్రమంలో తన స్వంత ఎజెండా అమలు చేయడం, అన్నింటికీ తానే చేశానని చెప్పడం, హై కమాండ్ ను పట్టించుకోక పోవడం, ప్రధాని మోదీ, బీజేపీ నేతలతో సఖ్యతగా ఉండడం, మంత్రివర్గాన్ని విస్తరించడం , బీసీలను విస్మరంచడం, ప్రాధాన్యత పోస్టులను పక్కన పెట్టడం , రేవంత్ ప్రైవేట్ సైన్యం, సోషల్ మీడియా, సోదరుల దౌర్జన్యం, బంధుప్రీతి ఎక్కువ కావడం సీఎంకు మైనస్ గా మారాయి. ఇదే క్రమంలో తనపై బహిరంగంగానే ఎమ్మెల్యేలు, మంత్రులు జట్టు కట్టడం తనకు ఇప్పుడు ఇబ్బందిగా మారింది. కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు తనపై. 20 మంది ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులన్నీ కట్టబెడుతున్నారని, తెలంగాణ వాళ్ల సంగతి ఏంటి అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో తనను పక్కన పెడుతూ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపట్టడం , తను పాల్గొనక పోవడం కూడా చర్చకు దారితీసేలా చేసింది. ఈ సమయంలో తనను మారుస్తారన్న ప్రచారం జోరందుకుంది. అదేమిటో కానీ తరుచూ సీరియస్ కామెంట్స్ చేసే సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా నిరాశ నిండిన మాటలు వాడాడు. సీఎం పోస్టు ఒక్కటే ఉంటుందని, అది ఒక్కరికే వస్తుందని, మిగతా వాళ్లు దానిని ఆశించడంలో తప్పు లేదన్నారు. దీని వల్ల రాష్ట్రం, దేశం అభివృద్ది పరంగా వెనుకకు వెళ్లే ప్రమాదం ఉందన్నాడు. పార్టీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను, ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న రేవంత్ రెడ్డిని తప్పించాలంటే ఏఐసీసీ చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పట్లో ఆ అవకాశం లేక పోయినా వన్ మ్యాన్ షో చేస్తున్న సీఎంకు చెక్ పెట్టిందన్నది మాత్రం వాస్తవం.