
వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి సంచలన కామెంట్స్
తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రసాయనాల, ఎరువుల మంత్రికి లేఖ రాశారు. ఖరీఫ్ 2025 సీజన్‌లో ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, వెంటనే తగినంత యూరియా సరఫరా చేయాలని కోరారు. రాష్ట్రంలో యూరియా అవసరం సుమారు 39 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉందని, అయితే అందుబాటులో ఉన్న నిల్వలు సరిపోవడం లేదని పేర్కొన్నారు. ఫలితంగా రైతులు ఎరువు కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లపై పరిమితులు విధించ బడుతున్నాయని, దీని కారణంగా యూరియా ధరలు పెరగడం వలన పంట సాగుపై రైతులలో ఆందోళనలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ఎంపీ లేఖకు ప్రతిస్పందిస్తూ యూరియా సరఫరా వివరాలు వెల్లడించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 20 వరకు ఆంధ్రప్రదేశ్‌కు 6,33,940 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరం 4,08,451 మెట్రిక్ టన్నులు మాత్రమేనని తెలిపారు. అమ్మకాలు 4,76,160 మెట్రిక్ టన్నుల వరకు జరిగి, ప్రస్తుతం 1,57,780 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. యూరియా సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవని, రాష్ట్రంలో అందుబాటు సక్రమంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా పర్యవేక్షించాలని, ఏవైనా ఇబ్బందులు వస్తే వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తన శాఖ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఈ లేఖపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి స్పందిస్తూ సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంటే, రాష్ట్రంలో యూరియా అందుబాటులో లేక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా నిల్వలు బ్లాక్ మార్కెట్ కి తరలుతున్నాయా లేక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అనే అనుమానాలు రైతులలో వ్యక్తమవుతున్నాయని ఆయన తెలిపారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందాన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి తయారయ్యిందని ఎంపీ ఎద్దేవా చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని యూరియా కొరత సమస్యను పరిష్కరించి, రైతుల అనుమానాలు నివృత్తి చేయాలని కోరారు.