
కాకినాడ పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ
అమరావతి : రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురు చూస్తున్న జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన యూరియాను పంపాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని మంత్రికి తెలిపారు అధికారులు. యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. ఎరువుల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి నడ్డాతో ఫోన్లో సీఎం చంద్రబాబు మాట్లాడటం వలనే రాష్ట్రానికి యూరియా కేటాయింపు చేయడం జరిగిందన్నారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడారు.
వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులకు ఎరువులపై భరోసా ఇవ్వాలని సూచించారు.
రబీ సీజన్ కు కేంద్రం 9.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రాష్ట్రానికి కేటాయించిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు యూరియా అందుబాటులో ఉంచాలని, ఇదే సమయంలో ఎవరికి ఎంతెంత కేటాయింపు చేశారనే దానిపై కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్క రైతుకు ఎరువు కొరత లేకుండా చూస్తామని , ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు అచ్చెన్నాయుడు.