
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కామెంట్స్
కాకినాడ : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. సోమవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో 20 శాతంకు పైగా వున్న మాల, మాదిగలను తమ వైపు తిప్పుకోవాలని తెలుగుదేశం పార్టీ భావించిందన్నారు. దళితుల కెమిస్ట్రీ గురించి చాలా మందికి తెలియదని, మోడీ, చంద్రబాబుకు అసలే తెలీదంటూ ఎద్దేవా చేశారు. దళితులను రెండు భాగాలుగా చేయడం వల్లే, రాష్ట్రం రెండుగా విభజన జరిగిందని ఆవేదన చెందారు. ఆనాడు తమ పార్టీ తప్పు చేసిందని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చని పోయిన సమయంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డికి కాకుండా ఉప ముఖ్యమంత్రి గా ఉన్న దామోదర రాజ నరసింహను చేసి ఉండి ఉంటే ఏపీ రెండు ముక్కలుగా అయ్యేది కాదన్నారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 800 కులాలు ఎస్సీల్లో ఉన్నారని చెప్పారు. ఒక్క యూపీలోనే ఎస్సీల్లో 86 ఉప కులాలు ఉన్నాయని అన్నారు చింతా మోహన్. దళితుల జోలికి వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని వార్నింగ్ ఇచ్చారు. కాళ్లు కాలిన పిల్లిలా ప్రధాని జపాన్, అమెరికా, ఉక్రెయిన్ అంటూ విదేశాలు తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. 2029 దాకా మోడీ గారు ఉంటారని నాకు నమ్మకం కలగడం లేదన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన పాపం తనకే దక్కుతుందన్నారు. అలహాబాదులో ఇందిరా గాంధీ పడిపోయినట్లుగా ప్రధాని పడిపోతారని నా అనుమానం అన్నారు.
ఆ విషయం ప్రధానికి కూడా తెలుసన్నారు. తెలిసీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.