
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ప్రభుత్వంపై. సీఎం నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలు యూరియా అందక ఆగమాగం అవుతున్నారంటూ వాపోయారు. ఈ నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే రైతు సమస్యలు పక్కనపెట్టి అసెంబ్లీలో బురద రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చర్చించే సమయం లేదు, సామర్థ్యం అంతకన్నా లేదన్నారు. ఆధార్ కార్డు, పాస్ బుక్కులు చేత పట్టుకొని యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు.
ఇది కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభం.. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల రైతన్నకు వచ్చిన సంక్షోభం అని వాపోయారు.
జై కిసాన్ అని నాటి కాంగ్రెస్ అంటే, నై కిసాన్ అని నేటి రేవంత్ అంటున్నాడంటూ ఎద్దేవా చేశారు. 8 మంది బిజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా తెలంగాణకు ఒనగూరింది ఏమీ లేదన్నారు. పనికిమాలిన డైవర్షన్ పాలిటిక్స్ మాని, యూరియా సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కేంద్రం పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపును ఉపసంహరించుకునేలా, పత్తిపై ఎత్తివేసిన దిగుమతి సుంకాన్ని యదావిధిగా కొనసాగించేలా ఎంపీలు ఒత్తిడి చేయాలన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి, కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా ఆదరా బాదరాగా ఆదివారం సభను నిర్వహించి, అర్థంతరంగా, అసంపూర్తిగా ముగించారని మండిపడ్డారు.