
సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు చెల్లవు
హైదరాబాద్ : సోషల్ మీడియా లో పోస్టులకు సంబంధించి అక్రమ కేసులు నమోదు చేయడం చెల్లవంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొంది. ఇది మంచి పద్దతి కాదని స్పష్టం చేసింది. ఈ సందర్బంగా హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి దక్కిన విజయంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఒంటెత్తు పోకడకు, అప్రజాస్వామిక నిర్ణయాలకు చెంప పెట్టు అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ట్వీట్లను రీట్వీట్ చేసినందుకు గానూ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్ల బాలుపై పోలీసులు అక్రమంగా నమోదు చేసిన మూడు కేసులను హైకోర్టు కొట్టి వేయడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం గత 21 నెలలుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై రాజకీయ ప్రేరేపితమైన కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు.
డీజీపీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌కు ఒక విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ మద్దతుదారులు, సోషల్ మీడియా యోధులపై వేధింపులను తక్షణమే ఆపాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అణచివేత కార్యక్రమాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకు నడవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తన కార్యకర్తలకు, కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి తీసుకు రావడానికి , పోరాడుతున్న వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.