
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. శుక్రవారం విజయవాడలోని ఎంబీ భవన్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైఎస్ షర్మిలా రెడ్డి. రాష్ట్ర ఎంపీలు బీజేపీని ఎత్తి పట్టుకున్నారని , కానీ ఇప్పటి వరకు స్టీల్ ప్లాంటుపై నోరు మెదపడం లేదని ఆరోపించారు. ఫ్లోర్ ఆఫ్ ది హౌజ్ లో ప్రైవేటీకరణ చేస్తున్నాం అంటే ఒక్కరైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంపీల మధ్య ఐకమత్యం లేనే లేదన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు స్వార్థ రాజకీయాల కోసం బీజేపీతో పొత్తులు పెట్టుకున్న వాళ్లేనని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో చట్ట సభలకు విలువ ఉందన్నారు. ఆ విషయం ఏపీకి చెందిన ఎంపీలకు లేక పోవడం దారుణమన్నారు. నేడు ఆ సభలకే వెళ్ళమని మానేస్తుండడం బాధాకరమన్నారు. చట్ట సభలకు ఎన్నికై వెళ్లకపోతే ఏం లాభం ? రాష్ట్ర హక్కుల మీద కోట్లాడాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. 2021 లో చంద్రబాబు విపక్ష నేతగా కేంద్రానికి ఒక లేఖ రాసిన విషయం మరిచి పోయారా అని నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పారన్నారు. ఇప్పుడు సదరు నాయుడు సీఎం పదవిలో ఉండి మరిచి పోతే ఎలా అని మండిపడ్డారు. మరి ఇప్పుడు చంద్రబాబు ఏం సమాధానం చెప్తారంటూ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రాణాలు అడ్డు వేస్తా అన్నారని ఇప్పుడు నోరు మెదిపితే ఒట్టు అన్నారు.