
మోస్తరు నుంచి భారీ వర్షాలు
అమరావతి : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆదివారం ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ రాష్ట్రంలో మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్ప పీడనం, ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.
ఈనెల 15న సోమవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికి గుంటూరులో 81 మిమీ, పల్నాడు జిల్లా తుర్లపాడులో 54.5 మిమీ, పెద్ద కూర పాడులో 40.2 మిమీ, గుంటూరు జిల్లా వంగిపురంలో 39.5మిమీ, కోనసీమ జిల్లా ముక్కములలో 39 మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.