
ఏపీ సర్కార్ పై వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్
అమరావతి : ఏపీ కూటమి సర్కార్ నిర్వాకం కారణంగా ఆరోగ్యశ్రీకి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏడాదికి ఆరోగ్యశ్రీ కింద రూ.4వేల కోట్ల కేటాయించేందుకు మనసు రాని ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచి పెట్టడానికి వేల కోట్లు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ కింద 1.60 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించే దాని కన్నా.. బీమా కంపెనీలు ఇచ్చేది తక్కువనా ? రూ.2.5 లక్షల లోపు ఆరోగ్య బీమా ఏంటి.. ఆపై ఖర్చును ట్రస్ట్ చెల్లించడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రైవేట్ బీమా అమలు చేసిన 18 రాష్ట్రాల్లో తిరిగి 16 రాష్ట్రాలు ప్రభుత్వ ట్రస్ట్ విధానానికి మార్చుకున్నాయని, ఆ విషయం గమనించకుండా కూటమి సర్కార్ గుడ్డిగా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు.
ప్రైవేట్ బీమా భారం తప్పా లాభం కాదని ఒప్పుకున్నాయని పేర్కొన్నారు. ట్రస్ట్ విధానంలో ఇంతకాలం నడిచే మన రాష్ట్రంలో ప్రైవేట్ బీమాను ప్రారంభించడంలో ఆంతర్యం ఏంటో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రైవేట్ కి లింక్ పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రస్ట్ విధానంలోనే ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని నడపాలని కోరారు. ఆసుపత్రులకు బకాయిలు పడ్డ రూ.2500 కోట్లను తక్షణం చెల్లించాలన్నారు. వెంటనే సమ్మెను విరమింప జేయాలని కోరారు. ఉన్నఫలంగా ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజారోగ్యంపై చెలగాటలు ఆడొద్దని వార్నింగ్ ఇచ్చారు షర్మిలా రెడ్డి. రాజకీయాలు ఆపాదించవద్దని, ఆరోగ్య శ్రీ సేవలను విస్తరింప జేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.