
అబద్దాల పునాదుల మీద ప్రభుత్వం
హైదరాబాద్ : మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అబద్ధాల పునాదుల మీదనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డి చేతిలో ప్రజలు మోసపోవడంలో వారి తప్పు లేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని అన్నారు. పాతకాలపు కాంగ్రెస్ రోజులను తిరిగి తీసుకు వచ్చిందన్నారు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించడంలో పార్టీగా మేం విఫలమయ్యామని అన్నారు. మనం చేసిన మంచిని, అభివృద్ధిని చెప్పుకోలేక పోయామన్నారు.
ఆరోజే కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ అని ప్రజలకు వివరిస్తే బాగుండేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనను నడిపించే సత్తా లేదు. అందుకే ప్రతిసారీ పాత ప్రభుత్వంపై నెపం నెట్టి వేస్తున్నదన్నారు. తమ చేతగానితనాన్ని గతం చాటున దాచి పెడుతున్నదని అన్నారు. ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవు అన్నారు. కాంగ్రెస్కు ఓటమి ఖాయం అని జోష్యం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు అంత పిరికివాళ్లుగా మారిపోయారో చెప్పాలన్నారు. నిజంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్కు దమ్ముంటే, ‘వారు మా కాంగ్రెస్లో చేరారు, ఉప ఎన్నికలకు పోదాం’ అని చెప్పాలన్నారు. తంతే గారెలు బుట్టలో పడినట్టు, లక్కీ లాటరీలో పడ్డట్టు మంత్రి అయిన పొంగులేటి పెద్దగా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.