
సీఎంపై సంచలన ఆరోపణలు
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికి పోయారంటూ పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీల ఓట్లను అమ్ముకున్నారని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీల ఓట్లు బీజేపీ అభ్యర్థికి వేసేలా చేశారన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సుదర్శన్ రెడ్డికి 315 ఓట్లు పడ్డాయని ట్వీట్ చేశారని, కానీ ఆయనకు కేవలం 300 ఓట్లు మాత్రమే వచ్చాయని, మరి మిగతా 15 ఓట్లు ఎవరికి పడ్డాయో చెప్పాలన్నారు. తెలంగాణకు చెందిన ఎంపీలు బీజేపీ క్యాండిడేట్ కు వేశారని ఆరోపించారు కౌశిక్ రెడ్డి. ఉప రాష్ట్రపతి ఎన్నికలు అయ్యాక తాము బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేశామని కాంగ్రెస్ ఎంపీలు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీని కలిశారని అన్నారు.
క్రాస్ అయిన 15 ఓట్లలో 8 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు ఉన్నాయని ఆరోపించారు కౌశిక్ రెడ్డి.
తెలంగాణకు రేవంత్ రెడ్డి ద్రోహం చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుతో లింక్ పెట్టుకుని కాంగ్రెస్ ఎంపీల ఓట్లు అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చశారు. ముగ్గురు ఎంపీలు తనతో బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేశామని చెప్పారన్నారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో సీఎం అదే పని చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. సుప్రీం కోర్టు మాజీ జడ్జి సుదర్శన్ రెడ్డిని రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చంద్రబాబు నాయుడు, మోడీకి చెల్లిస్తున్నారని అన్నారు.