
అక్టోబర్ 28 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులకు ఖుష్ కబర్ చెప్పింది సర్కార్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో 1,743 పోస్టుల ప్రత్యక్ష నియామకానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ భర్తీకి సంబంధించి జారీ చేసింది. వివిధ ట్రేడ్‌లలో 1,000 డ్రైవర్లు, 743 శ్రామిక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వచ్చే నెల అక్టోబర్ 8 నుండి అక్టోబర్ 28వ తేదీ వరకు వరకు అధికారిక టీఎస్ఎల్పీఆర్బీ వెబ్ సైట్ (www.tgprb.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపింది.
నోటిఫికేషన్ ప్రకారం డ్రైవర్ పోస్టులకు రూ. 20,960–రూ. 60,080 జీత స్కేల్ ఉంటుంది, అయితే శ్రామిక్ పోస్టులకు రూ. 16,550–రూ. 45,030 జీతం స్కేల్ ఉంటుందని స్పష్టం చేసింది. జిల్లాల వారీగా కేడర్ వారీగా పోస్టుల ఖాళీల గురించి వివరించడం జరిగింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరిలలో అత్యధిక సంఖ్యలో డ్రైవర్ ఖాళీలు ఉన్నాయి. శ్రామిక్‌ల పోస్టులకు సంబంధించి మెజారిటీ పోస్టులు మెకానిక్ (డీజిల్/మోటార్ వెహికల్)కి 589 ఖాళీలతో ఉన్నాయి, తరువాత ఆటో ఎలక్ట్రీషియన్లు, వెల్డర్లు, పెయింటర్లు , అప్హోల్‌స్టరర్లు వంటి ఇతర ట్రేడ్‌లు ఉన్నాయి. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఎవరూ మధ్య దళారీలను నమ్మ వద్దని కోరింది సంస్థ.