
హైదరాబాద్ వేదికగా ప్రకటించిన ఎమ్మెల్సీ
హైదరాబాద్ : చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న సంచలనంగా మారారు. ఆయన ముందుగా చెప్పినట్టుగానే హైదరాబాద్ వేదికగా కీలక ప్రకటన చేశారు. బుధవారం తాజ్ హోటల్ లో జరిగిన కీలక కార్యక్రమంలో బహుజనుల కోసం ప్రత్యేకంగా పార్టీ ఉండాలని తాము కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా తీన్మార్ మల్లన్న ప్రసంగించారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కొన్ని కులాలే అధికారాన్ని అనుభవిస్తున్నాయని ఆరోపించారు. అయితే రెడ్లు లేదా వెలమలు నిన్నటి దాకా పాలించారని, జనాభా పరంగా అత్యధికంగా జనాభా కలిగిన బహుజనులకు ఎలాంటి పవర్ లేకుండా పోయిందన్నారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగానే పొలిటికల్ ఎంట్రీ ఈజ్ ద మాస్టర్ కీ అన్నట్టుగానే తాము బీసీలకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టామన్నారు. బీసీలు అన్ని రంగాలలో వెనుకబాటు తనానికి గురయ్యారని వాపోయారు. మొత్తం రాష్ట్ర జనాభాలో కేవలం 6 లేదా 7 శాతం కలిగిన వారే ఉన్నత పదవులు, చట్ట సభల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ఉన్నారని ఆరోపించారు. అందుకే తమ పార్టీ రాజకీయాలలో పదవులకు దూరంగా ఉన్న వారిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టామన్నారు తీన్మార్ మల్లన్న.