
ఢిల్లీ వేదికగా ప్రకటించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
ఢిల్లీ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా ప్రభుత్వ ఆలోచనను వివరించారు. పరిపాలన చేసేందుకు రాజకీయ సంకల్పం ఎంతో అవసరం అన్నారు.భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించాలనేది తమ విధానం అన్నారు సీఎం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి “తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047”రూపొందిస్తున్నాం అని ప్రకటించారు. మొత్తం రాష్ట్రాన్ని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌గా ఈ ప్రణాళికలో మార్చడం జరగిందని చెప్పారు.కోర్ అర్బన్ ఏరియాలో కోటి మంది నివసిస్తున్నారని అన్నారు. ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలిస్తున్నామని వెల్లడించారు రేవంత్ రెడ్డి. సెమీ అర్బన్ ఏరియాను తయారీ రంగం జోన్ గా (మాన్యుఫాక్చర్) నిర్ణయించడం జరిగిందని స్పష్టం చేశారు.
తెలంగాణలో అభివృద్ధికి తగినట్లు 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీటర్లు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిత్యం అయిదు లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని, దానిని 15 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు సీఎం. సబర్మతీ తీరంలా మూసీని మారుస్తాం అన్నారు. అందుకు మూసీ పునరుజ్జీవంపై దృష్టి సారించడం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. 2027 నాటికి హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా ఉండనున్నాయని చెప్పారు. అందుకే ఈవీలకు రాయితీలు ప్రకటించామన్నారు. రాష్ట్ర అవసరాలకు తగినట్లు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ అనుసంధానం చేస్తామన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తామన్నారు. తెలంగాణలో పెట్టే పెట్టుబడులకు భద్రత ఉంటుందన్నారు సీఎం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపునిచ్చారు.