
ఏపీ శాసన సభలో ప్రకటించిన వ్యవసాయ శాఖ మంత్రి
అమరావతి : ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ఆయన కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పశు సంవర్దక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. గత వైసీపీ సర్కార్ పశువైద్యుల నియామక భర్తీని పాతరేసిందని ఆరోపించచారు. గత ఐదేళ్లలో పశుసంవర్ధక శాఖ అభివృద్ధి కుంటు పడిందని మండిపడ్డారు. పశువైద్య విద్యార్థుల స్టైఫండ్ పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. రాష్ట్రంలో పాడి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. గ్రామ స్థాయిలో వెటర్నరీ అసిస్టెంట్లు అద్భుతంగా సేవలు అందిస్తున్నారని చెప్పారు. పశుపోషణ ద్వారా మెరుగైన ఆర్ధిక జీవితం సాధ్యమవుతుందని వెల్లడించారు.
వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాటు పశుసంవర్ధక శాఖకు తాళాలు వేసి పశువైద్యుల నియామక భర్తీకి సంబంధించి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని, పాడి రైతులు, పశువుల సంరక్షణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని కింజరాపు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. 2014-2019 సమయంలో సీఎం చంద్రబాబు చొరవతో పశు వైద్యుల నియామక భర్తీకై నోటిఫికేషన్ ఇచ్చి 2017 సంవత్సరంలో 303, 2018లో మరొక నోటిఫికేషన్ ఇచ్చి 223 వెటర్నరీ డాక్టర్స్ పోస్టులు బర్తీ చేశామని తెలిపారు. 2024 ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎలా రిక్రూట్ చేయాలనేది ఆర్దిక శాఖకు నివేదిక అందచేశామని, ఆదేశాలు రాగానే ఖాళీగా ఉన్నటువంటి పశువైద్య డాక్టర్ల పోస్టులకు నోటీఫేకషన్ ఇచ్చి భర్తీ చేస్తామన్నారు.