
12 వసంతాలుగా ‘మనం సైతం’ నిరంతర సేవలు
హైదరాబాద్: నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం ఆదివారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. పన్నెండేళ్లుగా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఈ ఫౌండేషన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. నిరంతరం కాదంబరి కిరణ్ చేస్తున్న సేవలను పలువురు కొనియాడారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ మాట్లడారు. సీనియర్ జర్నలిస్ట్ జీ. కృష్ణ శిష్యుడిని. ఆ మహనీయుడి స్ఫూర్తితోనే సమాజిక సేవ ఆలోచన వచ్చిందన్నారు. 12 ఏళ్లుగా చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల్లో ఎందరో మహానుభావులు ఆశీర్వదించారు. మద్దతు తెలిపారు. వారందరి సహకారంతోనే ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నాం అని అన్నారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ కరోనా సమయంలో వందలాది కుటుంబాలకు కాదంబరి కిరణ్ సాయం చేశారు. అవసరమైన కిట్లు అందించారు. అప్పటి నుంచి కిరణ్ నాకు పరిచయం. రాజకీయాలకు సామాజిక సేవలకు సంబంధం లేదు. భారతీయుల్లో సేవా భావం ఉంటుంది. కిరణ్ సేవలకు మా మద్దతు ఉంటుంది అని పేర్కొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి మాట్లాడుతూ సమాజంలో ఒకరికొకరు తోడైతేనే మనుగడ ఉంటుంది. నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ పన్నెండేళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న సైతం ఫౌండేషన్ టీమ్‌కు, ఫౌండర్ కాదంబరి కిరణ్‌కు అభినందనలు . మీ సేవలు నిరంతరం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మా మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని అన్నారు.
ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ మనం సైతం ఫౌండేషన్ పుష్కర కాలం నుంచి ఇలా సేవలు చేయడం మామూలు విషయం కాదు. మున్ముందు చేసే సేవా కార్యక్రమాలకు నా మద్దతు ఉంటుందన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ కాదంబరి కిరణ్‌తో పాటు నేను కూడా జీ. కృష్ణ శిష్యులం. మనసు పెట్టి చేసే పనిని ఆర్ట్ వర్క్ అంటారు. హార్డ్ వర్క్ కాకుండా ఆర్ట్ వర్క్‌తో కాదంబరి కిరణ్ సమాజ సేవ చేస్తున్నారు. సమాజం కోసం ఎంతో కొంత సేవ చేయాలని కోరుకునే కిరణ్‌కు మనందరి సపోర్ట్ ఉండాలి అని అన్నారు.
సినీ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సేవ చేస్తే భగవంతుడు మనకు మేలు చేస్తాడు. కిరణ్‌కు దేవుడు మంచి మనసు ఇచ్చాడు అని పేర్కొన్నారు. టీవీ9 జర్నలిస్ట్ ప్రుథ్వి మాట్లాడుతూ కరోనా సమయంలో ఆయన సేవా కార్యక్రమాలు నేను ప్రత్యక్షంగా చూశాను. ఎంతో మందికి నిత్యావసరాలతో పాటు ఆర్థిక సహాయం చేశారు అని కొనియాడారు.
టీవీ5 మూర్తి మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో సంస్థలు ఉన్నా, కాదంబరి కిరణ్ మనలో ఉన్న మనిషిని గుర్తు చేస్తున్నారు. ఎవరికైనా కష్టం వస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ మనిషికి కష్టం వస్తే కాదంబరి కిరణ్ వస్తాడు అని వ్యాఖ్యానించారు.