
స్పష్టం చేసిన ప్రముఖ నటుడు మోహన్ లాల్
కేరళ : కేంద్ర ప్రభుత్వం తనకు ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల స్పందించారు మలయాళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ నటుడు మోహన్ లాల్. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తన ఉన్నతికి కారకులైన వాళ్లు, తన విజయానికి దోహద పడిన వాళ్లు, తన అడుగులకు శక్తిగా మారిన వాళ్లకు, పేరు పేరునా ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని , ఈ అవార్డు తనకు దక్కినది కాదని వారందరికీ చెందినదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి కేంద్ర కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని, మీరు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారని తెలిపారని చెప్పారు. కానీ దీనిని తాను నమ్మలేక పోయానని తెలిపారు. ఆ తర్వాత అది వాస్తవమని తెలుసుకున్నాక ఆనందానికి గురైనట్లు చెప్పారు మోహన్ లాల్.
ఇది తన జీవితంలో మరిచి పోలేని రోజుగా ఆయన అభివర్ణించారు. ప్రతి కళాకారుడికి ఓ కల ఉంటుందని, అది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవాలని. ఈ దేశ సినిమా రూపు దిద్దు కోవడానికి ప్రాణం పోసిన మహోన్నత మానవుడు ఫాల్కే అని కొనియాడారు. ఇవాళ ఆయన లేక పోయినా సినిమా విరాజిల్లు తోందన్నారు. ఇది ఒక అద్భుతమైన పరిశ్రమగా మారిందన్నారు మోహన్ లాల్. ఒక రకంగా ఆ దేవుడి దయ వల్ల తనకు ఈ పురస్కారం లభించిందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటుంది. నేను ఈ అవార్డును అందరితో పంచుకుంటాను. నేను విమర్శలను భుజాన వేసుకుని నడిచే వ్యక్తిని కాదు; ఈ క్షణం ఎంతో విలువైనది అని పేర్కొన్నారు. సినిమాల్లో 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మోహన్ లాల్, పరిశ్రమలోని కొంతమంది గొప్ప వ్యక్తులతో కలిసి పని చేయడం తన అదృష్టమని, వారి ఆశీస్సులు ఈ గౌరవం వెనుక ఉన్నాయని అన్నారు.