
నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి రండి
అమరావతి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొణిదలనను ఆయన ఛాంబర్ లో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 25న మెగా డీఎస్సీ విజేతలకు నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమానికి హాజరు కావాలని పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు. గత అయిదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయక పోగా, మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు దాదాపు 106 కేసులు వేశారని ఈ సందర్భంగా తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలుపుకుందని పేర్కొన్నారు. దీనివల్ల ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ టీచర్ల కలలు సాకారం అయ్యాయని మంత్రి లోకేష్ చెప్పారు.
గతంలో ఏపీలో పాలన సాగించిన వైఎస్సార్సీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు మంత్రి నారా లోకేష్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము వచ్చాక పూర్తి పారదర్శకంగా నియామకాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, పైరవీలకు చోటు లేకుండా అత్యంత పకడ్బందీగా మెగా డీఎస్సీని నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇప్పటికే 1754 పోస్టులను భర్తీ చేశామని, మెరిట్ నియామక జాబితాను ఖరారు చేశామన్నారు. ఇందులో భాగంగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. అందుకే రావాలని పవన్ ను కోరామన్నారు.