
కొనుగోలు చేయాలని కోరిన మంత్రి సవిత
అమరావతి : ఏపీ సర్కార్ దుస్తుల కొనుగోలుదారులకు తీపి కబురు చెప్పింది. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర బీసీ, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. సవిత. ఈ మేరకు ఆమె సోమవారం ఆప్కో ద్వారా ఉత్పత్తులకు భారీ ఎత్తున డిస్కౌంట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి అన్ని ఉత్పత్తులపై ఏకంగా 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల పెద్ద ఎత్తున చేనేతన్నలకు మేలు చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు మంత్రి ఎస్ . సవిత.
చేనేత వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్ తో వినియోదారులకు ఆర్థికంగా ఎంతో మేలు కలుగుతుందన్నారు . అదే సమయంలో చేనేత దుస్తుల అమ్మకంతో నేతన్నలకు కూడా ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు సవిత. దసరా, దీపావళి పండగలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు, చేనేతల కుటుంబాల్లో ఆనందాలు నింపడమే లక్ష్యంగా 40 శాతం డిస్కౌంట్ అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. చేనేత వస్త్రాలు తెలుగింటి సంప్రదాయానికి నిలువెత్తు ప్రతిబింబమన్నారు. ఇంటిల్లిపాది చేనేత దుస్తులు ధరించి నేతన్నలకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు మంత్రి, దసరా, దీపావళి పండగలను సంతోషంగా జరుపుకుందామని ఆమె కోరారు.
ఆరు నూరైనా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే చేనేత కార్మికులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించామన్నారు సమర్థుడైన నాయకత్వం కలిగిన సీఎం ఉన్నారని చెప్పారు. భారీ ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు మంత్రి ఎస్. సవిత.