
స్పష్టం చేసిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్ : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమని స్పష్టం చేశారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు ద్రోహం చేసి పార్టీ మారారని వారిని ప్రజలు క్షమించరని అన్నారు. అన్ని ఆధారాలు శాసన సభ సెక్రటరీకి సమర్పించడం జరిగిందని చెప్పారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం అని అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ నిర్ణయిస్తారని కడియం శ్రీహరి మాట్లాడటం దారుణమన్నారు. అసలు తనకు సోయి అనేది ఉందా అని నిప్పులు చెరిగారు. తమ పార్టీ బి ఫామ్ పై గెలిచి ఇప్పుడు మాట మార్చడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు జగదీశ్ రెడ్డి.
స్పీకర్ నిర్ణయం ఏదైనా ప్రజల దృష్టిలో వారెంటో ఇప్పటికే అర్థమై పోయిందన్నారు. వారిపై వేటు పడడం ఖాయమని, ఇప్పటికే సుప్రీంకోర్టు గడువు ఇచ్చిందని అన్నారు. ఉప ఎన్నికలు రావటం ఖాయమని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు మట్టి కరవటం తప్పదని హెచ్చరించారు జగదీశ్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే ఫిరాయింపుల చట్టం వచ్చిందన్నారు. ఫిరాయింపులు ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూంలో కొన్నారో కేటీఆర్ అక్కడే కొన్నారని చెప్పారు. బండి సంజయ్వి చిల్లర మాటలు తప్పా అవి పనికి వచ్చేవి కావన్నారు. ఆయనను ఎవరూ కేంద్ర మంత్రి అని అనుకోవడం లేదన్నారు.