
పట్టు సాగు పెంచేలా రైతులకు అవగాహన
అమరావతి : హిందూపూరంలో చేనేతలకు ఉపాధితో పాటు ఆధునిక దుస్తుల తయారీలో శిక్షణ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్ (ఎస్సీడీపీ) మంజూరు చేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ క్లస్టర్ తో 292 మంది నేతన్నలకు లబ్ధి చేకూరనుందని వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ లో ఉన్న తన పేషీలో ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి హిందూపురంలో స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్ (ఎస్సీడీపీ) ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి హిందూపురంలో స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్ (ఎస్సీడీపీ) ఏర్పాటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అంతకు ముందు హిందూపురంలో ఎస్సీడీపీ ఏర్పాటు, నేతన్నలకు శిక్షణ అందించే విషయమై ఫ్యాషన్ డిజైనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, రూ. 1.51 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఎస్సీడీపీకి కేంద్రం రూ.1.44 కోట్లు, లబ్ధిదారులు రూ.7.12 లక్షలు వాటాగా ఇవ్వనున్నారన్నారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం( ఎన్.హెచ్.డి.పి) కింద కేంద్ర ప్రభుత్వం హిందూపురానికి ఎస్సీడీపీ మంజూరు చేసిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నేతన్నలకు ఉపాధి లభించడంతో పాటు వారికి నేటితరం అభిరుచులకు అనుగుణంగా దుస్తుల తయారీలో శిక్షణ ఇవ్వనుమన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ నూతన చేనేత దుస్తుల తయారీలో నిపుణులు, ఫ్యాషన్ డిజైనర్లతో నేతన్నలకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుత తరం ఆలోచనలు, ఫ్యాషన్ ను దృష్టిలో పెట్టుకుని చేనేత దుస్తుల రూపకల్పనపై నేతన్నలకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన జీవనం అందించడానికి ఎస్సీడీపీ ఎంతో దోహడ పడుతుందన్నారు.