
ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
తిరుమల : ఇటీవలే భారత దేశానికి నూతన ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి. రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకోగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి వెళ్లి ధ్వజ స్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ కు టిటిడి ఈవ అనిల్ కుమార్ సింఘాల్ దర్శన ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా బుధవారం నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవలు ఘణంగా ప్రారంభం అయ్యాయి. గురువారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ తో కలిసి కుటుంబ సమేతంగా శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇవాళ మీ ముందు ఉన్నానంటే ప్రదాన కారణం కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామినేనని పేర్కొన్నారు. ఆయన చలవ వల్లనే ఇవాళ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కిందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను నిర్మించాలన్నది తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. నిబద్దత కలిగిన ఈవో తో పాటు టీటీడీ చైర్మన్, దేవాదాయ శాఖ మంత్రి సహాయ సహకారాలతో యుద్ద ప్రాతిపదికన ఆలయాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు నారా చంద్రబాబు నాయుడు.