
వచ్చే ఏడాది ఖండాంతరాలకు
హైదరాబాద్ : బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కోసం నిర్వహించే పింక్ పవర్ రన్ ను వచ్చే ఏడాది నుంచి ఖండాతరాలకు విస్తరించనున్నట్లు తెలిపారు పింక్ పవర్ రన్ నిర్వాహకురాలు, ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుధారెడ్డి . హైదరాబాద్ లో గత ఏడాది నిర్వహించిన రన్ విజయవంతం కావటం తమను ఉత్సాహ పరిచిందని తెలిపారు. తొలి విజయం బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహనను మరింత ముందుకు వెళ్లేలా చేసిందన్నారు. ఆ స్ఫూర్తితోనే రెండో ఎడిషన్ విజయవంతంగా నిర్వహించామని, వచ్చే ఏడాది ఈ రన్ ను మరిన్ని ప్రాంతాలకు, దేశాలకు విస్తరిస్తామన్నారు. ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో తాము పింక్ పవర్ రన్ ప్రారంభించామన్నారు. ఆరోగ్యమైన ప్రపంచం ఆనందంగా ఉంటుందన్నారు. ఆనందమైన ప్రపంచం పనితీరును మెరుగు పరుస్తుందన్నారు. తమ పరుగు వెనుక ప్రధానమైన స్ఫూర్తి ఇదేనని అన్నారు.
ఎంఈ ఐ ఎల్ ఎండీ పీవీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది హైదరాబాద్ రన్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. వయసు తారతమ్యం లేకుండా పింక్ పవర్ రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కృష్ణారెడ్డి అభినందించారు. ఈ రన్ ను ప్రతి ఏడాది నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా ఈ రన్ లో విజేతలకు బహుమతులు అందజేశారు. 10 కిలోమీటర్ల మారథాన్ పురుషుల విభాగంలో అంకిత్ గుప్త ప్రధమ స్థానంలో రాగా, కమలాకర్ దేశముఖ్ ద్వితీయ, శుభం సింధు తృతీయ స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో సీమ, భారతి నైనా , సోనికా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. వీరిలో మొదటి స్థానంలో నిలిచిన వారికి మూడున్నర లక్షలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రెండున్నర లక్షలు, మూడో స్థానంలో నిలిచిన వారికి లక్షన్నర నగదు బహుమతి తో పాటు ట్రోఫీ అంద చేశారు.
ఐదు కిలోమీటర్ల మారథాన్ లో పురుషుల విభాగంలో హర్మోన్జోత్ సింగ్, సునీల్ కుమార్, సచిన్ యాదవ్, మహిళల విభాగంలో అంకిత, నీతా రాణి, అంకిత గవిట్ తొలి మూడు స్థానాలు సాధించారు. వీరికి ట్రోఫీ తో పాటు రెండున్నర లక్షలు, లక్షన్నర, లక్ష రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందచేశారు.