
సంచలన ప్రకటన చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై : ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ కరూర్ లో చేపట్టిన ప్రచార ర్యాలీ మహా విషాదాన్ని నింపింది. పలువురు కుటుంబాలలో కన్నీళ్లను మిగిల్చింది. అత్యంత బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసేలా చేసింది. రాష్ట్రంలో విజయ్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను పవర్ లోకి రావాలని కొత్తగా పార్టీ పెట్టాడు. ఇటీవలే రెండో సమావేశం నిర్వహించాడు. భారీ ఎత్తున జనం పోగయ్యారు. తొలి సభతో పాటు, రెండో సభలో కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఎలాంటి ప్లాన్ లేకుండా తను ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. ఈ సమయంలో విజయ్ తమిళనాడు డీఎంకే సర్కార్ ను, ప్రధానంగా సీఎం ఎంకే స్టాలిన్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చారే తప్పా తన ఎన్నికల ప్రచారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై దృష్టి సారించ లేదన్న విమర్శలు ఉన్నాయి.
ముందస్తు ఏర్పాట్లు చేయడంలో కరూర్ జిల్లా టీవీకే పార్టీ నిర్వాహకులు విఫలయ్యారు. ఈ ఘటనతోనే తేలి పోయింది. మొత్తంగా ఈ విషాదానికి పూర్తి కారణం విజయ్ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా టీవీకే విజయ్ నిర్వహించిన ర్యాలీలో ఇప్పటి వరకు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నారు. వీరిలో ఆరుగురు చిన్నారులు కూడా ప్రాణాలు విడిచారు. ఈ విషాద సమయంలో తీవ్రంగా స్పందించారు సీఎం ఎంకే స్టాలిన్ . బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అంతే కాకుండా ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. రిటైర్డ్ న్యాయమూర్తి అరుణ జగదీశన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.