
సత్తా చాటిన స్టార్ బౌలర్..నాలుగు వికెట్లు
దుబాయ్ : ఆసియా కప్ 2025 ముగిసింది. టీం ఇండియా జైత్రయాత్ర సాగించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో సత్తా చాటింది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించింది. ఏకంగా మూడు సార్లు తనను ఓడించింది. భారత జట్టుపై ద్వేషం కక్కుతూ వచ్చిన పాకిస్తాన్ ను కోలుకోలేకుండా చేశారు భారత బౌలర్లు. కళ్లు చెదిరేలా అద్బుతమైన బంతులతో ఆకట్టుకున్నారు. పాక్ బ్యాటర్లు చేతులెత్తేలా చేశారు. ఈ టోర్నీలో ప్రత్యేకంగా నిలిచాడు ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ముందుగా టాస్ గెలిచిన సూర్య కుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లను ఆడలేక పోయింది.
146 పరుగులకే చాప చుట్టేసింది. ఒకానొక దశలో ఒక వికెట్ నష్టానికి 86 పరుగులతో ఉన్న ఆ జట్టు ప్లేయర్లు 33 పరుగుల తేడాతో 9 వికెట్లు కోల్పోయారు. దీనికంతటికీ ప్రధాన కారకులు బౌలర్లేనని చెప్పక తప్పదు. జోరు మీద ఉన్న పాకిస్తాన్ జట్టుకు అడ్డుకట్ట వేశాడు వరుణ్ చక్రవర్తి. తను తొలి వికెట్ తీస్తే ఆ తర్వాత టాప్ ఆర్డర్ ను కుప్ప కూల్చాడు కుల్దీప్ యాదవ్. తను ఏకంగా 4 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచ్ లు ఆడి 17 వికెట్లు తీశాడు. అనంతరం మైదానంలోకి దిగిన భారత జట్టు సైతం త్వరలోనే వికెట్లను కోల్పోయింది. 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత శాంసన్, దూబే, తిలక్ వర్మల పోరాటంతో విజయం వరించింది.