
భక్తులతో కిట కిట లాడిన తిరుమల
తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈనెల 24న ప్రారంభమైన ఈ ఉత్సవాలు వచ్చే నెల అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతాయి. టీటీడీ పాలక మండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో భాగంగా జరిగిన శ్రీవారి గరుడ వాహన సేవకు రికార్డు స్థాయిలో భక్తులు హాజరయ్యారు. ఏకంగా 3 లక్షల మందికి పైగా హాజరైనట్లు స్వయంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా వివిధ దేశాల నుంచి తరలి వచ్చిన కళాకారులు తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించారు.
కాగా ఉత్సవాలను పురస్కరించుకుని కోరిన కోర్కెలు తీర్చే శ్రీ వేంకటేశ్వర స్వామి బంగారు తేరులో విహరించారు. భక్తుల్ని తన కృపా కటాక్షాలతో అనుగ్రహించారు. దాస భక్తుల నృత్యాలతోను, భజన బృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ తిరు మాడ వీధులలో కడు రమణీయంగా స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు. ఇదిలా ఉండగా స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగ భాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్త ధాన్యాలూ, శ్రీవారి కరుణతో సర్వ శుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం.
ఈ స్వర్ణ రథోత్సవంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, సీఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.