
మైమరిపించిన భక్తి సంగీత కార్యక్రమాలు
తిరుపతి : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. పట్టణంలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు రాజమండ్రికి చెందిన డా.పి.సింధూరి వారి బృందం చేసిన “వాగ్గేయకార వైభవం” కూచిపూడి నృత్య ప్రదర్శన సభను భక్తి సాగరంలో ముంచెత్తింది. ఇందులో భాగంగా దశరథ తనయ, జయ జయ జయవర్షిణి అన్న అష్టలక్ష్మి కీర్తన, రామాయణ వైభవం అన్న అంశములపై సాగిన ప్రదర్శన అత్యంత రమణీయంగా, భక్త ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకుంది.
అన్నమాచార్య కళా మందిరంలో సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు విజయవాడకు చెందిన శ్రీ చదలవాడ సిస్టర్స్ రామ పరిణయం నిత్య రూపకం పుర ప్రజలను విశేషంగా అలరించింది.
శ్రీ కోదండ రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు కాకినాడకు చెందిన పవన్ కుమార్ బృందం సుందరాకాండ తోలు బొమ్మలాట ప్రదర్శించారు. ఉత్సవాలను పురస్క రించుకుని దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు తరలి వచ్చారు. తమ కళా రూపాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పుర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో అలరారుతోంది. గోవింద నామ స్మరణతో మారుమ్రోగుతోంది.