
నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన అక్టోబర్ 2వ తేదీ గురువారం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 నుండి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవ మూర్తులకు, చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం, చక్రస్నానం చేపట్టారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. టిటిడి అధికారులు, విజిలెన్స్, పోలీసుల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూశారు. భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెలుపలికి వెళ్లేందుకు వీలుగా గేట్లను ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు. పుష్కరిణిలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను, బోట్లను అందుబాటులో ఉంచింది టీటీడీ ముందు జాగ్రత్తగా.
చక్రస్నానం సందర్భంగా 1,000 మంది పోలీసులు, 1300 మంది టిటిడి విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఫైర్, స్మిమ్మింగ్ తదితర విభాగాల నుండి 140 మందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. టిటిడి సూచించిన నిబంధనల మేరకు గ్యాలరీలలోని భక్తులను దశల వారీగా పుష్కరిణిలోకి అనుమతించారు. పుష్కరిణిలోనికి నిర్దేశించిన గేట్ల ద్వారా మాత్రమే ప్రవేశించేలా చేశారు. భక్తులు శ్రీవారి చక్రస్నానం వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడవీధుల్లో 23, పుష్కరిణిలో 4, మొత్తం 27 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌలభ్యం కొరకు అవసరమైన సమాచారం అందించేందుకు పుష్కరిణి సమీపంలోని రథం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.