
అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం
అమరావతి : సూపర్ సిక్స్ పథకాల అమల్లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం అమలు చేస్తున్నాం అన్నారు. ఇందు కోసం రూ.10,090 కోట్లు 63.77 లక్షల మంది విద్యార్ధుల తల్లులకు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశామని తెలిపారు. ఆడబిడ్డలకు వంటింటి కష్టాలు తీర్చాలని దీపం పథకాన్ని అమలు చేస్తున్నాం అన్నారు సీఎం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని. పథకం వల్ల ఏడాదిలో కోటికి పైగా కుటుంబాలు ప్రయోజనం పొందాయన్నారు. 2.66 కోట్ల సిలిండర్లు సబ్సిడీపై అందించడం జరిగిందన్నారు. దీనికి రూ.1,718 కోట్లు ఖర్చు పెట్టాం అన్నారు. స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్ట్ 15న ప్రారంభిస్తే 45 రోజుల్లోనే దగ్గర దగ్గరగా మహిళలు10 కోట్ల ప్రయాణాలు చేయడం నాకు ఆనందంగా ఉందన్నారు. ఈ పండుగ సీజన్ లో అన్ని దేవాలయాల్లో మహిళా భక్తుల సంఖ్య భారీగా పెరిగిందని పేర్కొన్నారు. పథకం అమల్లో భాగంగా నెలకు రూ.247 కోట్లు, ఏడాదికి రూ.2,963 కోట్లు స్త్రీ శక్తి కోసం ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు.
డ్రైవర్ల కష్టాలు నాకు తెలుసు కాబట్టే వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు పథకం తెస్తున్నామని సీఎం అన్నారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఆదాయం తగ్గకుండా ఉండేందుకు ఈ నెల 4న ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుడుతున్నాం అని ప్రకటించారు సీఎం. ఒక్కో ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం ఇస్తామన్నారు. దాదాపు 2.90 లక్షల మంది ఆటోడ్రైవర్లు ఈ పథకానికి అర్హులుగా గుర్తించామని తెలిపారు. ఈ పథకం అమలుకు ఏడాదికి రూ.435 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి ఒక్కో రైతుకూ రూ.20,000 ఇస్తున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ లో మొదటి హామీ మెగా డీఎస్సీ నిర్వహించామన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే అధికారంలోకి రాగానే మొదటి సంతకం పెట్టి ఏడాదికే టీచరు పోస్టులు ఇచ్చామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు నేను అండగా ఉంటానని అన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 9,093 మందిని, పోలీస్ శాఖలో 6,100 ఉద్యోగాలు భర్తీ చేశాం. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇప్పటికే 5,500 మందికి ఉపాధి కలుగుతోందన్నారు. ఈ 15 నెలల్లో ఇప్పటి వరకు మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు దక్కేలా చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.