
రూ. 5 లక్షలు టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు
తిరుపతి : తిరుపతిలోని గంగమ్మ ఆలయానికి సంబంధించి నూతన స్థలం కోసం నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తమ కుటుంబం తరపున రూ. 5 లక్షలు విరాళంగా అందించారు. ఈ ఆలయ అభివృద్దిలో కీలక పాత్ర పోషించారంటూ తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు మేయర్. భూమన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గంగమ్మ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు రావడం ప్రారంభమైందన్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. టిటిడి నిధులను కేటాయించడం, దేవాదాయ శాఖ, నగరపాలక సంస్థ, ఇతర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రజల సహకారంతో అత్యంత వైభవోపేతంగా జాతరను నిర్వహించడం జరిగిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు వై.యస్.జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి తిరుపతి గంగమ్మ జాతరకు అధికారిక గుర్తింపు ఇవ్వడం, ఆలయ జీర్ణోద్ధరణ , విస్తరణ పనులు , ప్రహరీ నిర్మాణం పూర్తి చేశారని చెప్పారు.
దాతల సహకారంతో వజ్ర కిరీటం అమ్మ వారికి చేయించిన ఘనత భూమన కరుణాకర్ రెడ్డికే దక్కుతుందన్నారు. గంగమ్మ మనందరి గ్రామ దేవత అని, తిరుపతి నగర ప్రజలను కంటికి రెప్పలా నిత్యం కాపాడుతున్న తల్లి అని కొనియాడారు. భక్తుల సంఖ్య పెరుగుతుంది కానీ ఆ తల్లి ప్రాశస్త్యం నేటి తరానికి తెలియచె ప్పండం మన బాధ్యత అని అన్నారు. ఆ బాధ్యతను దృష్టిలో ఉంచుకుని కరుణాకర్ రెడ్డి తిరుపతి గంగ జాతరను ఎంత వైభవం జరిపారో తిరుపతి నగర ప్రజలకు తెలుసు అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలకు తిరుపతి గంగమ్మ ఆలయ చరిత్రను నేటి తరానికి అందించే ప్రయత్నం విసృతంగా చేశారని చెప్పారు మేయర్ శిరీష. స్వయాన శ్రీనివాసుని చెల్లెలు అయినందున తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు మొదట గంగమ్మను దర్శనం చేసుకున్న తర్వాత తిరుమలకు వెళ్ళే మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.