
రాష్ట్ర బీసీ , సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత
కడప జిల్లా : అన్ని రంగాలలో ఏపీ దూసుకు పోతోందని చెప్పారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత.
స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన 2,90,669 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున్న ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారన్నారు. ఇందుకోసం రూ.436 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోందని చెప్పారు సవిత. ఈ మొత్తాన్ని నేరుగా ఆటో డ్రైవర్ల ఖాతాలోనే జమ చేస్తున్నామన్నారు. కడప జిల్లాలో 12 వేల మందికి, పులివెందుల నియోజక వర్గంలో 1,296 మంది ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు.
అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేని వారి కోసం ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌ను రూపొందించామని చెప్పారు ఎస్. సవిత. అర్హత ఉన్న ప్రతి ఒక్కొరికీ ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా ఆర్థిక సాయం కల్పిస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని ఇన్చార్జి మంత్రి సవిత తెలియజేశారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ గా అభివృద్ధి చేయడంతో పాటు పులివెందులకు నీరిచ్చిన ఘనత కూడా తమదేనన్నారు. కడప స్టీల్ పనులు ఇప్పటికే ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్నిచూడలేక కొందరు విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ఏ విషయంపై నైనా చర్చించడానికి సిద్ధం ఉన్నామని మంత్రి సవిత సవాల్ విసిరారు.