
పిలుపునిచ్చిన మంత్రి ఎస్. సవిత
తిరుపతి : సాధువు, యోగి భక్త కనకదాసును స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి ఎస్. సవిత. తిరుపతి పట్టణంలో ఏర్పాటు చేసిన భక్త కనకదాసు విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో కురబల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందన్నారు ఎస్. సవిత. నీతి, నిజాయితీతో పాటు కష్టపడే తత్వాన్ని కురబలు కలిగి ఉన్నారని చెప్పారు. గతంలో ఏ పార్టీలు కూడా బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కానీ ఎప్పుడైతే దివంగత మహా నాయుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారో ఆనాటి నుంచి బీసీలకు ఉమ్మడి ఏపీలో కీలకమైన పదవులతో పాటు ప్రాధాన్యత దక్కిందని చెప్పారు. ఎందరికో ఆయన రాజకీయ పునరావాసం కల్పించిన ఘనత తనకే దక్కుతుందన్నారు.
ఆనాడు కురబ సామాజిక వర్గానికి చెందిన సంజీవ రెడ్డికి ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇచ్చారని, ఆ తర్వాత తన కేబినెట్ లో కీలకమైన మంత్రి పదవిని కట్టబెట్టారని పేర్కొన్నారు మంత్రి ఎస్. సవిత. ఆయన తన జీవిత కాలంలో ఏకంగా 14 కీలకమైన శాఖలను నిర్వహించారని, వాటికి వన్నె తెచ్చారని తన పనితీరుతో అని చెప్పారు. ఆ తర్వాత ఇదే ప్రయారిటీ కొనసాగిస్తూ వస్తున్నారని ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి పేర్కొన్నారు. తాజాగా ఎంపీ బీకే పార్థసారథికి అవకాశం కల్పించారని పేర్కొన్నారు .
విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. తిరుపతిలో భక్త కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఇదే విషయమై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి సవిత వెల్లడించారు. కురుబల ఆర్థికాభివృద్ధికి గొర్రెలు, మేకల ఫాం యూనిట్లు అందజేయనున్నట్లు తెలిపారు. గొర్రెలు, మేకలకు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కూడా కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. సద్గురు నిరంజన మహానంద స్వామీ, కురుబ సామాజిక వర్గీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.