
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మ వారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్య నిర్వహణాధికారి (ఈవో) వి.కె. శీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి, దృష్టి దోష నివారణకు గుమ్మడి కాయను కొట్టారు. కాబోయే నూతన చైర్మన్ బోర్ర రాధాకృష్ణ, దేవాదాయ శాఖ ఎస్టేట్ ఆఫీసర్ ఆర్ జె సి భ్రమరాంబ ఇరువురు విశేష అతిథులుగా పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణలో అశేష భక్తజనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్ తో పాటు ఆలయ స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ, ముఖ్య అతిథులు శ్రీనివాస్ శాస్త్రితో కలసి భక్తులతో శ్రీ అమ్మవారి గిరి ప్రదక్షిణకు పాదయాత్రగా ముందుకు సాగారు. దీంతో భక్తుల్లో, ఆలయ సిబ్బందిలో మరింత ఉత్సాహం పెరిగింది.
వేకువ జామునే వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్నారు. కనుల పండువగా జరిగిన ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆనందంలో మునిగి పోయారు. పౌర్ణమి గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగిసింది. పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరి, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణ సాంప్రదాయాన్ని అనుసరించి వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు పొందుతారు. ఈ గిరి ప్రదక్షిణలో సంప్రదాయ కళా ప్రదర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణం తీసుకొని వచ్చారు.