
త్వరలోనే పరిహారం కూడా ఇస్తానని ప్రకటన
చెన్నై : టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ మంగళవారం కరూర్ ఘటనలో మృతి చెందిన 41 కుటుంబాల బాధితులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. ఈ మేరకు వీడియో కాల్స్ చేశారు. త్వరలోనే మీ వద్దకు వస్తానని, మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ఇదే సమయంలో ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి పూర్తిగా పార్టీ పరంగా వైద్య ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు వీజయ్. ఇదిలా ఉండగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. అంతే కాకుండా గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు.
ఇదే సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబాలను స్వయంగా సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి కేంద్రం అండగా ఉంటుందన్నారు. ఈ మేరకు కేంద్రం తరపున ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 50 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు నటుడు దళపతి విజయ్. ఈ మేరకు బాధిత కుటుంబాల కోసం సంచలన ప్రకటన చేశారు. ఒక్కో కుటుంబానికి పార్టీ తరపున రూ. 20 లక్షలు ఇస్తానని తెలిపారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి పూర్తి వైద్య ఖర్చులు భరిస్తానని ప్రకటించారు.